అమరావతిలో భూముల కొనుగోలు : టీడీపీ నేత ఇంటికి నోటీసులు అంటించిన సీఐడీ

  • Published By: veegamteam ,Published On : February 29, 2020 / 04:09 AM IST
అమరావతిలో భూముల కొనుగోలు : టీడీపీ నేత ఇంటికి నోటీసులు అంటించిన సీఐడీ

టీడీపీ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. అమరావతిలో భూముల కొనుగోలుపై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. టీడీపీ హయాంలో లక్ష్మీనారాయణ అల్లుడు శ్రీనివాసరావు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌గా ఉన్నారు. లక్ష్మీనారాయణ కుమారుడు సీతారామరాజు టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్‌గా ఉన్నారు. అయితే.. అధికారులు వచ్చే సమయానికి లక్ష్మీనారాయణ కుటుంబీకులు అందుబాటులో లేరు. మరోవైపు సీఐడీ అధికారులను లక్ష్మీనారాయణ ఇంటిలోనికి అనుమతించలేదు సెక్యూరిటీ. దీంతో సీఐడీ అధికారులు ఇంటికి సెర్చ్ నోటీస్ అంటించి వెళ్లారు.

అక్రమాలపై విచారణకు సిట్‌ ఏర్పాటు 
టీడీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. రాజధాని పేరుతో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం గురిపెట్టింది. సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం నిన్న విజయవాడలో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. విజయవాడ పటమటలో కొందరు కోటీశ్వరుల ఇళ్లల్లో కూడా తనిఖీ చేసింది. 

Also Read | ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సిట్‌ దూకుడు : టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు

కీలక ఆధారాలు సేకరించిన సిట్‌ 
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వియ్యంకుని ఇంట్లో తనిఖీలు చేసిన సిట్‌ పలు కీలక ఆధారాలను సేకరించింది. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకుంది. సిట్‌ అధికారులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. వారి ఆస్తులు, ఆదాయాలు, రాజధానిలో కొన్న భూములు, వాటికి డబ్బులు ఎలా వచ్చాయి, టీడీపీ  నేతలతో వారి సంబంధాలపై ప్రశ్నించడంతోపాటు వారి వద్ద అనేక పత్రాలను తీసుకుని పరిశీలించారు. కాగా, ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలపై సీఐడీ ఏడు కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై ఈడీ కూడా మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది.