చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్: అభిమానుల పిల్లలకు ఫీజు రాయితీ

  • Published By: vamsi ,Published On : May 12, 2019 / 11:42 AM IST
చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్: అభిమానుల పిల్లలకు ఫీజు రాయితీ

సినిమా రంగంలో మెగాస్టార్‌గా వెలుగువెలిగిన చిరంజీవి.. రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. ఇప్ప‌ట్లో రాజ‌కీయాల వైపు చిరంజీవి వెళ్లే అవకాశం కూడా క‌నిపించ‌ట్లేదు. ఇక‌పై పూర్తిగా సినిమాల‌పైనే చిరంజీవి దృష్టి పెడుతారేమో అనుకుంటున్న తరుణంలో బిజినెస్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. గతంలో న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగానే కాకుండా బిజినెస్ మ్యాన్‌గా కూడా చిరంజీవికి అనుభ‌వం ఉంది. టీవీ చానెల్ నిర్వహణ, స్పోర్ట్స్ ప్రాంచైజ్‌లు వంటి బిజినెస్‌లు చేసాడు చిరంజీవి.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విద్యారంగంలోకి ప్రవేశించి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, అధునాతన సౌకర్యాలు, ఏసీ వసతులతో ఇంటర్నేషనల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశారు. చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్స్ పేరుతో స్కూళ్లను ఏర్పాటు చేసిన చిరంజీవి స్కూల్స్‌కు సీఈవోగా జె శ్రీనివాసరావును నియమించారు. శ్రీకాకుళం నగర శివార్లలోని పెద్దపాడు రోడ్డులో మొదటి చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ ను అన్ని సదుపాయాలతో నెలకొల్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి గ్రేడ్ 5 వరకు ఐజిసిఎస్ఈ, సీబీఎస్ఈలలో తరగతులు అందుబాటులోకి రానున్నాయి.

ఏసీ క్లాస్ రూమ్‌లు, ఆడియో విజువల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సీసీటీవీల ద్వారా పర్యవేక్షణ, పేరెంట్-టీచర్ ఇంటరాక్షన్, ఇంగ్లిష్ గ్రామర్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఇంటర్నేషనల్ స్కూల్‌ల ప్రత్యేకత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా తరగతులను నిర్వహించనున్నారు.

ఈ స్కూల్స్ కి మెగాస్టార్ చిరంజీవి గౌరవ వ్యవస్థాపకులుగా, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌరవ అధ్యక్షుడిగా, నాగబాబు గౌరవ చైర్మన్‌గా ఉంటారు. ఈ స్కూల్ లో మెగాస్టార్ చిరంజీవి అభిమానుల పిల్లలకి ప్రత్యేక ఫీజు రాయితీలు ఉంటాయని సీఈవో జె శ్రీనివాసరావు వెల్లడించారు. చిరంజీవి అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.