సామాన్యుడికి మరో షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

10TV Telugu News

Petrol prices rise again: చమురు ధరలు మంట పుట్టిస్తున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో పెరిగిన ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచుతూ కంపెనీలు ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకున్నాయి.‌ తాజాగా పెరిగిన ధరలతో ఢిల్లీలో పెట్రోల్‌ లీటర్‌కు రూ.86.65, డీజిల్ ధర లీటర్‌కు రూ.76.83కు చేరింది. గత ఏడాది(2020) నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధర సుమారు రూ.14 పెరిగింది.

తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్‌ ధర రూ.90.10, డీజిల్‌ రూ.83.81కు చేరాయి. కోల్‌కతాలో పెట్రోల్ రూ.88.01, డీజిల్ రూ.80.41.. చెన్నైలో పెట్రోల్ రూ.89.13, డీజిల్ రూ.82.04.. బెంగళూరులో పెట్రోల్ రూ.89.54, డీజిల్ రూ.81.44.. నోయిడాలో పెట్రోల్ రూ.85.91, డీజిల్ రూ.77.24, గురుగ్రామ్‌లో పెట్రోల్ రూ.84.72, డీజిల్ రూ.77.39కు చేరాయి.

ఇక ముంబైలో చమురు ధరలు సామాన్యుడికి షాకిచ్చే రీతిలో పెరిగిపోతున్నాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.20 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.83.73 పైసలకు చేరింది. దేశంలోని నాలుగు మెట్రో నగరాలతో పోలిస్తే ముంబైలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికం. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90 దాటడం వాహనదారుల్లో ఆందోళన నింపింది.

జనవరి 6, 2021 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పైకి ఎగబాకడం ఇదే తొలిసారి. బడ్జెట్‌లో పెట్రోల్ మీద రూ.2.50, డీజిల్ మీద రూ.4 చొప్పున అగ్రి ఇన్‌ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించిన విషయం విదితమే. దీంతో చమురు ధరలు భారీగా పెరగనున్నాయని వార్తలు వచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టడం ఖాయం అని అంతా అనుకున్నారు. అయితే అగ్రి సెస్ విధించినప్పటికీ.. పెట్రోల్, డీజిల్‌పై బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీలను తగ్గిస్తున్నామని.. అందువల్ల వినియోగదారులపై అదనపు భారం పడదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

కాగా, చమురు కంపెనీలు సామాన్యుడికి ఒకేరోజు రెండు షాక్ లు ఇచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెంచాయి. నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై(14.2kg) రూ.25 పెంచాయి. ఈ ధరలు నేటి(ఫిబ్రవరి 4,202) నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే మెట్రో నగరాలకు మాత్రమే ఈ పెంపు పరిమితం.

ఒమన్, దుబాయ్ నుంచి ముడి చమురుని భారత్ దిగుమతి చేసుకుంటుంది. అక్కడ ముడి చమురు బ్యారల్ ధర 55.18 డాలర్లుగా ఉంది. కరోనా కారణంగా చమురు ధరలు 2020 ఏప్రిల్ లో 19.90 డాలర్లకు పడిపోయాయి. ఆ తర్వాత డిసెంబర్ నాటికి 49.84 డాలర్లకు చేరింది.

10TV Telugu News