మతసామరస్యానికి ప్రతీక : ప్రారంభమైన రొట్టెల పండుగ

  • Published By: madhu ,Published On : September 10, 2019 / 08:33 AM IST
మతసామరస్యానికి ప్రతీక : ప్రారంభమైన రొట్టెల పండుగ

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండగ ప్రారంభమైంది. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం నాలుగు రోజులపాటు ఈ వేడుక జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న రొట్టెల పండగ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూల నుంచి భక్తులు తరలివస్తారు. 10 నుంచి 12లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. దర్గాలోని అమరుల సమాధులను దర్శించుకునే భక్తులు… తమ కోర్కెలు తీర్చాలంటూ స్థానిక స్వర్ణాల చెరువులో రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. కోర్కెలు తీరినవారు తిరిగి రొట్టెను వదులుతారు. 

మొహర్రం నెలలో నెలవంక కనిపించిన 11వ రోజున రొట్టెల పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల్లో తొలి రోజు అయిన మంగళవారం షహద్‌త్‌ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 11వ తేదీ బుధవారం గంధమహోత్సంలో భాగంగా కోటమిట్ట అమీనియా మసీదు నుంచి గంధాన్ని తీసుకొచ్చి 12 మంది షహీద్‌ల సమాధులకు లేపనం చేసి, భక్తులకు పంచుతారు. సెప్టెంబర్ 12వ తేదీ గురువారం తమ కోర్కెలు తీరాలని భక్తులు వివిధ రకాల రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. 

ఇక్కడ పంచుకునే ఒక్కో రొట్టె ఒక్కో రకం. గోధుమ, బియ్యం పిండితో తయారుచేసే ఆరోగ్య రొట్టెలకు.. ఆకుకూర, మునగకూర తాళింపుచేసి అందిస్తారు. ఉద్యోగ, పెళ్లి రొట్టెలకు బెల్లం
ఉంచి అందించాలనేది నియమం. కోరిన కోర్కె నెరవేరిన వారు మొత్తం ఐదు రొట్టెలను తయారు చేస్తారు. వాటిని ఒకటి ఇంట్లో ఉంచుకొని మిగిలిన నాలుగు రోట్టెలను దర్గా వద్దకు తీసుకొస్తారు. రెండు స్వర్ణాల చెరువలో దేవుడి పేరుతో సమర్పించి మిగిలిన రెండింటిని మార్పిడి చేసుకొంటారు. కోర్కె కలిగిన వారు ఆ రొట్టెలను స్వీకరిస్తారు. ఆ తర్వాత రోజు అంటే సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం తహలీల్‌ ఫాతేహ, సెప్టెంబర్ 14వ తేదీ శనివారం ముగింపు జరుగుతుంది. రొట్టెల పండుగకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో.. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. 
Reade More : ఇదేం పని : భార్యతో శ్రీశైలం గేట్లు ఎత్తించిన ఇంజినీర్