ఏపీలో కరోనా టెస్టింగ్ సెంటర్లుగా ఆర్టీసీ బస్సులు

  • Published By: nagamani ,Published On : July 20, 2020 / 11:22 AM IST
ఏపీలో కరోనా టెస్టింగ్ సెంటర్లుగా ఆర్టీసీ బస్సులు

కరోనా పరీక్షలు చేయటంలో ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంటోంది. ఇప్పటికే పలు పరీక్షా కేంద్రాల్లో అనుమానితులకు పరీక్షలు చేస్తుండగా..వాటి సంఖ్య సరిపోవటంలేదు. దీంతో ఆర్టీసీ బస్సులను కూడా పరీక్షా కేంద్రాలుగా మార్చేశారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ 52 ఆర్టీసీ బస్సులను సంజీవని కరోనా పరీక్షా కేంద్రాలుగా మార్చింది.

వీటిని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. కరోనా పరీక్షల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఈ ఆర్టీసీ బస్సుల గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా పరీక్షలు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని..ఇందుకోసం రాష్ట్రంలో 52 ఆర్టీసీ బస్సులను కరోనా పరీక్షా కేంద్రాలుగా మార్చారని వెల్లడించారు. కృష్ణాజిల్లాకు మూడు బస్సులను కేటాయించారని తెలిపారు. అవసరాన్ని బట్టి వీటి సంఖ్యనుపెంచుతామని తెలిపారు.

ఒక్కొక్క బస్సులో ఒకేసారి పదిమందికి కరోనా పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అన్నారు. పరీక్షలు ఎక్కువ చేస్తున్నా.. ఫలితాలు రావడంలేదనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం కాదని అన్నారు.24గంటల్లోనే రిపోర్టు ఇచ్చేందుకు ఏడు మిషన్లు అదనంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కోసారి టెక్నికల్ గా ఇబ్బందుల వల్ల ఫలితాలు రాకపోయి ఉండవచ్చని అంతే తప్ప ఫలితాలు రావటంలో ఆలస్యం జరుగుతోందని వార్తల్లో నిజం లేదని తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్షకు పైగా కరోనా పరీక్షలు చేసిన జిల్లాల్లో ఏపీలోనే నాలుగు ఉండగా, కృష్ణాజిల్లా ప్రధమ స్థానంలో ఉందని హర్షం వ్యక్తంచేశారు.