పోలీస్ స్టేషన్ లో JC దివాకర్ రెడ్డి హల్ చల్

10TV Telugu News

అనంతపురం జిల్లాలో JC దివాకర్ రెడ్డి హల్ చల్ చేశారు. ఎల్లనూరు మండలం పోలీస్ స్టేషన్‌ దగ్గర వీరంగం వేశారు. వైసీపీ నేతలపై తిట్లపురాణం అందుకున్నారు జేసీ. స్టేషన్‌లో ఉన్న వైసీపీ నాయకుడు బోగాతి విజయ్ కుమార్ రెడ్డిపై ఏకంగా దాడికి ప్రయత్నించారు జేసీ దివాకర్ రెడ్డి. ఇంతా జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించారు. ఉన్నతాధికారులకు వైసీపీ కంప్లయింట్ చేయటంతో.. వారే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. జేసీని బలవంతంగా పోలీస్ స్టేషన్ గేటు బయటకు తీసుకొచ్చారు.

తాడిపత్రిలో ఓ పోలింగ్ కేంద్రంలో వైసీపీ – టీడీపీ నేతలు కొట్టుకున్నారు. అక్కడకు చేరుకున్న పోలీసులు రెండు వర్గాల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కి తరలించారు. విషయం తెలుసుకున్న జేసీ అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. దీంతో జేసీ నోటికి పని చెప్పారు. బండబూతులు తిడుతూ రెచ్చిపోయారు. పోలీసులు అక్కడే ఉన్నా.. కనీసం పట్టించుకోలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేతలు రిగ్గింగ్ చేయడానికి యత్నించడంతోనే.. మేం అడ్డుకున్నాం అని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. తప్పు టీడీపీ వాళ్లు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు.