వాట్ యాన్ ఐడియా రైతన్నా : ప్లాస్టిక్ డ్రమ్ములే పంట పొలాలు

  • Published By: veegamteam ,Published On : September 8, 2019 / 09:23 AM IST
వాట్ యాన్ ఐడియా రైతన్నా : ప్లాస్టిక్ డ్రమ్ములే పంట పొలాలు

మేధావులు అంటే పెద్ద పెద్ద యంత్రాన్ని కనిపెట్టినవారేకాదు..అందరి కడుపులు నింపే రైతన్నలు కూడా మేధావులే. పంట పండించేందుకు జానెడు జాగా లేకపోయినా పంటలు పండించే రైతులు మేధావులు కాక మరేమిటి చెప్పండి.  భూమి లేకుండా పంటలేమిటా అనుకోవచ్చు. డాబాలపైనా..కుండీల్లోను కూరగాయాల్ని పండించటం చూస్తున్నాం. కానీ ప్లాస్టిక్ డ్రమ్ముల్నే పంట పొలాలుగా మార్చేసిన ఓ రైతన్న అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 
   
వినూత్న రీతిలో రుచికరమైన కూరగాయల్ని పండిస్తున్నారు ప్రకాశం జిల్లాలోని బోడపాటి బ్రహ్మయ్య. చిల్లులు పడిన ప్లాస్టిక్ డమ్ముల్ని పక్కన పడేస్తాం.కానీ వాటితో బ్రహ్మయ్య ప్రకృతి సేద్యం బాటలో.. జీరో బేస్డు వ్యవసాయాన్ని ప్రారంభించి హీరో అనిపించుకుంటున్నాడు. తక్కువ స్థలంలోనే ఎక్కువ పంటలు పండించడానికి కృషి చేస్తున్నాడు 65ఏళ్ల బ్రహ్మయ్య.చిన్నప్పటి నుంచీ వ్యవసాయం చేసి అప్పుల్లో కూరుకుపోయాడు. నష్టాలు వచ్చినా..అప్పుల్లో కూరుకుపోయినా రైతు రైతే. మట్టినే నమ్ముకుంటాడు.అందరికీ బుక్కెడు బువ్వ పెడతాడు. 

ఎన్ని నష్టాలు వచ్చినా వ్యవసాయంపై మక్కువ పోలేదు బ్రహ్మయ్యకు. పోలీయోతో శరీరం సహకరించకపోయినా..సాగు చేయటం అంటేనే ప్రాణం పెడతాడు బ్రహ్మయ్య. టీవీల్లో వచ్చే వ్యవసాయ కార్యక్రమాలు చూసి..పుస్తకాల్లో చదివి తనకొచ్చిన వినూత్న ఆలోచనతో ప్లాస్టిక్ డ్రమ్ముల్లో  కూరగాయాల్ని పండించాలని ప్రయత్నించాడు. అది మంచి ఫలితాల్ని ఇవ్వటంతో బ్రహ్మయ్య ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

ఒంగోలులో తనకున్న కేవలం  5 సెంట్ల స్థలంలో ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వ్యవసాయం ప్రారంభించాడు.ఒక్కో డ్రమ్ము చుట్టూ 28 బెజ్జాలు పెట్టి..డ్రమ్ముల చుట్టూ బెజ్జాలు పెట్టి..వాటిలో ప్లాస్టిక్ పైపులు అమర్చాడు. సేంద్రియంగా తయారుచేసిన ఎరువును, మట్టినీ కలిపి డ్రమ్ము, పైపుల్లో నింపుతూ… నాలుగు బెజ్జాలకు ఒక రకం చొప్పున రక రకాల కూరగాయల మొక్కల్ని నాటాడు. వీటితో పాటు డ్రమ్ము పైభాగాన  తీగరకాల మొక్కలు (పాదులు) వేశాడు. 

ఆ తీగల్ని పందిరికి పాకించాడు. అలా ఒకొక్క డ్రమ్ములో పలు రకాల పాదులు..కాయగూరలు, ఆకుకూరల రకాల మొక్కల్ని నాటుతున్నాడు. ఇలా పెద్ద సంఖ్యలో డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని అద్భుతంగా సాగు చేస్తున్నాడు. కేవలం సేంద్రియ పద్ధతిలోనే వీటి సాగు చేస్తున్నాడు బోడపాటి బ్రహ్మయ్య ఒకేచోట ఎక్కువ సంఖ్యలో పంటల్ని పండిస్తు  అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

పాదు రకాల్లో బీర, కాకర, చిక్కుడు, సొరకాయ పండించగా, డ్రమ్ము చుట్టూ వంకాయి, మిరప,తోటకూర, కొత్తిమీర, బెండ వంటి కూరగాయలు పండిస్తున్నాడు. డ్రమ్ముల్లో మట్టి నింపడం దగ్గర నుంచీ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం నీరు పెట్టడం, వాటికి రసాయనేతర మందులతో  పిచికారి చేయడం వంటి పనులన్నీ బ్రహ్మయ్య ఒక్కడే చేసుకుంటున్నాడు. సేంద్రియ పద్ధతి కాబట్టి పెద్దగా ఖర్చు లేకుండానే సాగు చేస్తున్నాడు. అంగవైకల్యం ఉన్నా వినూత్న ప్రయోగంతో మంచి ఫలితాలు సాధిస్తున్న బ్రహ్మయ్య ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.