MLC Balmoor Venkat : హరీష్‌రావు రాజీనామా లేఖ వృథా కానివ్వను : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా హరీష్‌రావు రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చెప్పారు.

MLC Balmoor Venkat : హరీష్‌రావు రాజీనామా లేఖ వృథా కానివ్వను : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

MLC Balmoor Venkat

MLC Balmoor Venkat : బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్‌రావుపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం (ఏప్రిల్ 26) అమరవీరుల స్థూపాన్ని ఆయన పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ.. హరీష్‌రావు రాజీనామా లేఖ వృథా కానివ్వమని అన్నారు.

ఉద్యమ సమయంలో నిరుద్యోగులు, యువతను పొట్టనపెట్టుకున్న వ్యక్తి హరీష్‌రావు అంటూ మండిపడ్డారు. అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో ఈ ప్రాంతం మైల పడిందని, అందుకే పసుపు నీళ్లతో శుద్ధి చేశామని చెప్పారు. 10 ఏళ్లుగా హరీష్‌రావుకి, బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరుల గుర్తుకు రాలేదని బల్మూర్ వెంకట్ విమర్శించారు. టీఆర్ఎస్‌లో హరీష్ రావు ఒక జీతగాడు మాత్రమేనన్నారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం.. ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరతారని స్పష్టం చేశారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారని దుయ్యబట్టారు. ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా హరీష్‌రావు రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేసినా రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా? అని సూటిగా ప్రశ్నించారు.

కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆగస్ట్ 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్టుగా బీఆర్ఎస్ రద్దు చేస్తారో, లేదో కేసీఆర్‌ చెప్పాలన్నారు. ఆగస్ట్ 15 తర్వాత హరీష్ రావు రాజీనామా ఆమోదం పొందేలా ఎమ్మెల్సీగా తాను బాధ్యత తీసుకుంటానని అన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగలా వచ్చి వెళ్ళడం కాదని, పదేళ్లలో మీరు ఏం చేశారో చెప్పాలన్నారు. ఈ విషయంలో ఎమ్మెల్సీ‌గా సవాల్ విసురుతున్నానని బల్మూర్ వెంకట్ అన్నారు.

Read Also : Sajjala Ramakrishna Reddy : సీఎం జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఎందుకు? సజ్జల కీలక వ్యాఖ్యలు