‘బాలయ్య బంగారం’.. కోవిడ్ సెంటర్‌కు భారీ విరాళం..

  • Published By: sekhar ,Published On : August 24, 2020 / 11:17 AM IST
‘బాలయ్య బంగారం’.. కోవిడ్ సెంటర్‌కు భారీ విరాళం..

NBK Donation for Covid Center: బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధికి నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతగా శ్రమిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో ఆయన ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ‘సీసీసీ మనకోసం’కు భారీగా విరాళం ఇవ్వడమే కాకుండా, సినిమా ఇండస్ట్రీలోని చాలా మందికి ఈ కోవిడ్ సమయంలో ముందు జాగ్రత్తగా తీసుకోవలసిన మందులను.. మెడికల్ కిట్స్ రూపంలో అందించారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధిగా రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి రూపాయల భారీ విరాళం అందించారు. ఇక తన నియోజకవర్గం అయినటువంటి హిందూపూర్ విషయంలో కూడా బాలయ్య ఎంతో సర్వీస్ అందించారు.



తన నియోజక వర్గంలో పీపీఈ కిట్స్ విషయంలోగానీ, మాస్క్‌ల విషయంలో కానీ, కోవిడ్ పేషెంట్స్ విషయంలో గానీ ఎప్పటికప్పుడు వైద్యులను, అలాగే ప్రభుత్వాన్ని అలెర్ట్ చేస్తున్న బాలయ్య తాజాగా తన నియోజక వర్గంలోని కోవిడ్ సెంటర్ కోసం రూ. 55 లక్షల విరాళం ప్రకటించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని కోవిడ్ సెంటర్‌కు మెడిసెన్స్, పీపీఈ కిట్స్, మాస్క్స్ ఇంకా ఇతర పరికరాల నిమిత్తం ఆయన ఈ విరాళాన్ని ప్రకటించారు. హాస్పిటల్‌కు కావల్సిన రూ.8 లక్షల పరికరాలతోపాటు, కరోనా బాధితులకు రూ.47 లక్షల విలువైన మందులు అందించనున్నారు.



ఇటీవలే రూ.25 లక్షలు విలువచేసే రెండు వెంటిలేటర్స్ బాలయ్య అందించారు. ఇదంతా కూడా ఆయన తన సొంత నిధులతో చేయడం విశేషం.
ఇంత క్లిష్ట సమయంలో ఎమ్మెల్యే స్థానిక ప్రజల పట్ల ఆప్యాయత చూపుతూ సహాయ సహకారాలు అందించడం హర్షించదగ్గ విషయం అంటూ బాలయ్యను ప్రశంసిస్తున్నారు హిందూపూర్ ప్రజలు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య ఫ్యాన్స్ తెగ షేర్స్ చేస్తూ.. ‘మా బాలయ్య బంగారం’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.