ఏప్రిల్ 06న తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు!

ఏప్రిల్ 06న తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు!

By-elections in Telugu states : ఏప్రిల్ 06వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ స్థానానికి ఎన్నికలు జరుగనుందని తెలుస్తోంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రత్యేక షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు. ఇక అదే తేదీన తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక : –
నాగార్జునసాగర్ ఉపఎన్నిక అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. తెలంగాణపై పట్టు తమదే అని నిరూపించుకోవడానికి టీఆర్ఎస్‌, కారుకు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకునేందుకు బీజేపీ, రాష్ట్రంలో ఇంకా తమకు పట్టుందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్‌… ఈ మూడు పార్టీలకు నాగార్జున సాగర్ ఉపఎన్నికల కీలకంగా మారింది. తెలంగాణలో ప్రస్తుత శాసనసభా కాలంలో ఇది మూడో ఉపఎన్నిక. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండోది. గత రెండు ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు ఆయా పార్టీల నుంచి చేజారిపోవడంతో.. నాగార్జునసాగర్ ఉపఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

నోముల తనయుడు నోముల భగత్ : –
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మాయ్య తనయుడు నోముల భగత్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి టిఆర్ఎస్ నుంచి ప్రధాన ఆశావాహులుగా ఉన్నారు. ఇక షెడ్యూల్ విడుదల కావడంతో ఒకటి, రెండు రోజుల్లోనే అధికార టిఆర్ఎస్ తమ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హాట్ హాట్ గా ఉన్న రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది. రాష్ట్రంలో భవిష్యత్ రాజకీయాలకు ఈ ఉపఎన్నిక ఒక దిక్సూచీ కానుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో అన్నీ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక :
పార్లమెంట్‌ ఉపపోరుపై అన్ని పార్టీల్లోనూ ఎక్కడా లేనంత గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల్లోనే కాదు అధికారపక్షంలోనూ అదే పరిస్థితి. పోటీకి సిద్ధమని అన్ని పార్టీలు పైకి ధీమాగా చెబుతున్నా… అభ్యర్థుల విషయంలో అందరిలోనూ సందిగ్ధం కొనసాగుతోంది. ప్రకటించిన అభ్యర్థి బయటకు రాని పరిస్థితి టీడీపీలో ఉండగా, అభ్యర్థి సిద్ధంగా ఉన్నా పేరు ప్రకటించలేని పరిస్థితి అధికార వైసీపీది. ఇప్పటివరకు అభ్యర్ధే దొరకని పరిస్థితి బీజేపీ-జనసేన కూటమిలో ఉండగా….సిద్ధంగా ఉన్న అభ్యర్థి బరిలో దిగుతాలో లేదో అన్న అనుమానం కాంగ్రెస్‌ను వెంటాడుతోంది.