రోడ్డుపై బైక్ డాన్స్ లేస్తే…జీతాలు, ఆస్తులు అమ్ముకోవాలి

  • Published By: chvmurthy ,Published On : August 31, 2019 / 03:40 PM IST
రోడ్డుపై బైక్ డాన్స్ లేస్తే…జీతాలు, ఆస్తులు అమ్ముకోవాలి

Updated On : August 31, 2019 / 3:40 PM IST

పార్లమెంట్‌లో 2019 ఆగస్టు 9న ఆమోదం పొందిన మోటార్ వాహనాల (సవరణ) చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలను సెప్టెంబరు 1 నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా వివిధ రకాలకు చెందిన పోలీసులు… కొత్త మోటారు వాహనం చట్టంపై విస్తృతంగా ప్రచారం చేసారు. మనుషుల ప్రాణాలు కాపాడటమే ఏకైక లక్ష్యంగా 30 ఏండ్ల క్రితంనాటి మోటారు వాహనాల చట్టం 1989లో సవరణలు చేసి మోటారు వాహనాల(సవరణ) బిల్లు – 2019ను రూపొందించారు. ఈ బిల్లు ఆమోదంతో గతంలో ఉన్న జరిమానాలు అన్ని భారీగా పెరిగిపోయాయి.

వాహనదారులు ఇకపై రోడ్డుపై వాహనం నడపాలంటే  ఖచ్చితమైన నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్‌పై ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పోలీస్ అధికారులు విధించే భారీ జరిమానాలతో జేబులకు చిల్లులు పడటం ఖాయం.  తొలుత రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన పాలనాపరమైన నిబంధనలనే ఎక్కువగా అమల్లోకి తెస్తున్నారు.  దీని ప్రకారం ఇకనుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లే నాలుగేళ్లలోపు పిల్లలు కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై రూ.500 నుంచి రూ.10,000 వరకూ జరిమానా, ఆరు నెలలపాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
 
అధిక లోడుతో వెళ్లే వాహనాలపై రూ.20 వేల జరిమానాతో పాటు ప్రతి అదనపు టన్నుకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తారు. పైగా వాహానంలో తీసుకు వెళుతున్న అదనపు బరువును దించేంతవరకూ ఆ వాహనాన్ని అక్కడి నుంచి కదలనివ్వరు.  పరిమితికి మించి ఎక్కువమంది ప్రయాణికులను ఎక్కించుకొనే వాహనాలకు ఒక్కో ప్రయాణికుడిపై రూ.200 చొప్పున జరిమానా విధించడంతోపాటు, అదనపు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించిన తర్వాతే ముందుకు వెళ్లేందుకు అనుమతిస్తారు.

సీటు బెల్టు ధరించకుండా కార్లు నడిపే  డ్రైవర్లకు రూ.వెయ్యి జరిమానా విధిస్తారు. ఇప్పటి వరకు వాహనదారులకు ఆయా మోటార్ వాహన చట్టంలో అమలైన సాధారాణ జరిమానాలు, శిక్షలతో సరిపెట్టిన అధికారులు, ప్రస్తుతం అమలులోకి రానున్న కొత్త చట్టం ద్వారా కఠినమైన నిబంధనల విషయంలో చర్యలు తీసుకోనున్నారు.  కాగా, నిబంధనలు ఉల్లఘించే వాహనదారులకు విధించే అపరాధ రుసుం వివరాలను పరిశీలిస్తే……

* హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే… కొత్త చట్టం మేరకు రూ.1000 (ప్రస్తుతం రూ.100) లేదా మూడు నెలల పాటు లైసెన్సు రద్దు చేస్తారు.
* మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు (ప్రస్తుతం రూ.2 వేలు)
* సీటుబెల్టు పెట్టుకోకుండా కారునడిపితే రూ.వెయ్యి (ప్రస్తుతం రూ.100)
* డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.500)
* రాంగ్ రూట్‌లో వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1100)
* అతివేగం తో వాహనం నడిపితే రూ.1000 లేదా రూ.2 వేలు (ప్రస్తుతం రూ.400)
* ప్రమాదకరంగా వాహనం నడిపితే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1000)
* అంబులెన్స్ ల వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేలు (ప్రస్తుతం ఎలాంటి అపరాధం లేదు)
* వాహనానికి బీమా లేకపోతే రూ.2 వేలు (ప్రస్తుతం రూ.1000)
* పర్మిట్ లేని వాహనానికి రూ.10 వేలు (ప్రస్తుతం రూ.5000)
* త్రిబుల్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (ప్రస్తుతం రూ.1200)
* సెల్‍‌ఫోన్ డ్రైవింగ్ చేస్తే రూ.5 వేలు (రూ.వెయ్యి)
* మైనర్లు డ్రైవింగ్ చేస్తే రూ.25 వేలు లేదా సంరక్షకులు లేదా యజమానికి మూడు సంవత్సరాల జైలుశిక్ష మరియు అపరాధం. ప్రస్తుతం రూ.1500 మాత్రమే వసూలు చేస్తున్నారు.