భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కేశవరావుపల్లికి చెందిన కావలి నర్సింహులు (25) కు కోస్గి మండలం కొండాపూర్ వాసి యాదమ్మ (21) తో 16 నెలల క్రితమే వివాహమైంది. స్థానికంగా తమ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
సోమవారం (సెప్టెంబర్ 2, 2019) వ తేదీన సొంత పనిమీద బైక్‌పై భార్యాభర్తలిద్దరూ నవాబుపేటకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అమ్మపూర్‌గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు బైక్ పైనుంచి భార్య కింద పడింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం (సెప్టెంబర్ 4, 2019) వ తేదీ ఉదయం మృతి చెందింది.
దీంతో ఒంటరి జీవితం తనకు వద్దంటూ మనస్తాపం చెందిన భర్త నర్సింహులు సమీపంలోని తమ పొలం దగ్గరకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు. కాగా, వివాహం జరిగి రెండేళ్లైనా కాకుండానే భార్యభర్తలు మృతి చెందడంతో గ్రామస్తులు బోరున విలిపిస్తున్నారు.