గ్రాండ్ గా 117 ఏళ్ల బామ్మ పుట్టిన రోజు: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నీస్ రికార్డ్
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరొందిన జపాన్ బామ్మ కెన్ తనాకా తన 117వ పుట్టిన రోజును జనవరి 2న అత్యంత ఘనంగా జరుపుకున్నారు. జపాన్‌లోని ఫుఫుఓకాలోని నర్సింగ్ హోమ్‌లో స్నేహితులు, బంధువులు, సన్నిహితుల మధ్య తనాకా తన బర్త్ డే వేడులను జరుపుకున్నారు. బర్త్ డే కేక్ కట్ చేసి కేకు ముక్కను తిని బామ్మ చిరునవ్వులు చిందిస్తూ..‘‘వెరీ టేస్టీ..నాకు ఇంకా బోల్డన్ని కేక్స్ కావాలి’’ అన్నారు.
1903లో జన్మించిన కెన్ తనాకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా గిన్నీస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు అని గుర్తిస్తూ.. మార్చి 9,2019లో గిన్నీస్ బుక్ యాజమాన్యం కెన్ తనాకాకు సర్టిఫికెట్ అందజేశారు.
19 ఏళ్ల వయసులో తనాకాకు హిదెఓ తనాకాతో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు. తరువాత వారు ఒక చిన్నారిని దత్తత తీసుకున్నారు. ఈ జంటకు 8 మంది మనుమలు. తనాకా భర్త, పెద్ద కుమారుడు రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించారు. దీంతో తనాకా కుటుంబాన్ని పోషించేందుకు దుకాణం నిర్వహిస్తూ వచ్చింది. తనాకా కోలోరెక్టల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అయినప్పటికీ బోర్డ్ గేమ్‌ను ఆడుతుంటుంది.