బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా.. మరో ఇద్దరు కూడా..

తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ కప్పిన గులాబీ కండువాను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వినమ్రంగా పోస్టు ద్వారా పంపిస్తున్నట్టు రాపోలు ఆనంద భాస్కర్ వెల్లడించారు.

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ రాజీనామా.. మరో ఇద్దరు కూడా..

Rapolu Ananda Bhaskar quit BRS party

Rapolu Ananda Bhaskar: రాజ్యసభ మాజీ సభ్యుడు, పద్మశాలి సంఘం నేత రాపోలు ఆనంద భాస్కర్.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు. రాపోలు ఆనంద భాస్కర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీని వీడిన మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ నేత, రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు తీగల లక్ష్మణ్ గౌడ్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఇంతకాలం తనను ఆదరించినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్ వెలుపల శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి తన అవసరం లేదని, అందుకే గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. విధిలేని పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నానని, దూరమవుతూ దూషించడం తన నైజం కాదన్నారు. తనను పార్టీలోకి ఆహ్వానిస్తూ కప్పిన గులాబీ కండువాను హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు వినమ్రంగా పోస్టు ద్వారా పంపిస్తున్నట్టు వెల్లడించారు. బలహీనవర్గాల ఆకాంక్షల సాధన, సామాజిక న్యాయ ఉద్యమాల్లో భవిష్యత్తులో తనదైన పాత్ర పోషిస్తానని చెప్పారు. చేనేత సామాజిక వర్గ ఉపాధి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటు పడుతూనే ఉంటానని తెలిపారు.

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్రలు జరుగుతున్నాయని, వాటిని నిలువరించే ఉద్యమాల్లో కీలక భూమిక పోషిస్తానని ప్రకటించారు. హైదరాబాద్ అంశాన్ని రేవంత్ రెడ్డి,కేసీఆర్ అందరి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం ప్రగతి పరిరక్షణ కోసం ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తానని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రియాశీలకంగా పనిచేస్తోందని.. కుల జనగణన దిశగా అడుగులు వేస్తోందని ప్రశంసించారు. ఏ పార్టీలోకి వెళతాననేది చెప్పలేనని.. ప్రజా ఉద్యమాల్లో ఉంటానని పేర్కొన్నారు.

Also Read: బీజేపీ పాలనలో ప్రశ్నార్ధకంగా సింగరేణి ప్రస్థానం: ప్రొఫెసర్ కోదండరాం

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా 2022, అక్టోబర్‌లో బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు రాపోలు ఆనంద భాస్కర్. 25 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన 2019, ఏప్రిల్ లో ఆ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగానే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.