తమిళనాడు NLC థర్మల్ పవర్ స్టేషన్ లో బాయిలర్ బ్లాస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : May 7, 2020 / 01:53 PM IST
తమిళనాడు NLC థర్మల్ పవర్ స్టేషన్ లో బాయిలర్ బ్లాస్ట్

వైజాగ్ లో గ్యాస్ లీక్ జరిగిన రోజే తమిళనాడులో మరో ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని కడలూరు జిల్లాలో NLC థర్మల్ పవర్ స్టేషన్ లో ఇవాళ(మే-7,2020)మధ్యాహ్నాం ఓ బాయిలర్ బ్లాస్ట్ జరిగింది. కడలూరు జిల్లాలో ఉన్న నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న బాయిలర్‌లో పేలుడు సంభవించడంతో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయాలపాలైనట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. దీంతో ఆ చుట్టుపక్కల ప్రజలు భయంకంపితులు అయ్యారు. బాయిలర్ పేలిన విషయం తెలిసిన వెంటనే కంపెనీకి చెందిన రిలీఫ్, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ఫైరింజన్ సిబ్బంది, పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కంపెనీకి చెందిన ఉన్నతాధికారులు కూడా హుటాహుటిన ఘటన స్థలానికి బయలుదేరారు. ప్రస్తుతం ప్లాంట్‌లో పనులను నిలిపివేశారు.

కాగా,ఇవాళ ఇవాళ తెల్లవారుజామున ఏపీలోని వైజాగ్ లోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో నుంచి విషవాయువు ఘటనలో ఇప్పటివరకు 11మంది ప్రాణాలు కోల్పోగా,1000మందికి పైగా హాస్పిటల్ పాలయ్యారు. విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదం జరిగి 24గంటలైనా గడవకముందే చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయ్ ఘర్ లోని ఓ పేపర్ మిల్ లో గ్యాస్ లీకేజ్ అయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వర్కర్లు హాస్పిటల్ పాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమచారం.