వందల మందిని కాపాడిన పబ్ జీ గేమ్

  • Published By: srihari ,Published On : May 10, 2020 / 12:22 PM IST
వందల మందిని కాపాడిన పబ్ జీ గేమ్

Updated On : May 10, 2020 / 12:22 PM IST

పబ్ జీ గేమ్ కు అలవాటు పడి ఎంతో మంది యువకులు ప్రాణాలు తీసుకున్న సందర్భాలున్నాయి. అయితే ఇప్పుడు ఇదే పబ్ జీ గేమ్ ..విశాఖ ఎల్ జీ పాలిమర్స్ లో జరిగిన ఘటనలో కొంతమంది పాలిట వరంగా మారింది. గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ప్రాణ నష్టాన్ని నియంత్రించడానికి ఉపయోగపడింది. విశాఖపట్టణంలోని వెంకటాపురం గ్రామంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఎల్ జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకైంది.    

ఆ సమయంలో చుట్టుపక్కల గ్రామస్తులంతా గాఢ నిద్రలో ఉన్నారు. గ్యాస్ లీక్ కావడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా హడలిపోయింది. అదే సమయంలో వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు..తన స్నేహితులతో పబ్ జీ గేమ్ ఆడుతున్నాడు. ఏదో ఘాటైన వాసన వస్తుందని గుర్తించి వెంటనే తన స్నేహితులను పిలిచి వారికి విషయం చెప్పాడు. 

పొగతో కప్పబడిన వాసన వీధుల గుండా రావడాన్ని గమనించారు. పరిశ్రమ నుంచి స్టైరిన్ లీక్ అయిందని గమనించి కిరణ్ అనే వ్యక్తి స్థానికులను తరలించే ప్రయత్నం చేశాడు. గ్రామానికి చెందిన ఆ యువకులు ఒక గంటలో ఐదు వందల కుటుంబాలను బయటకు తీసుకురాగలిగారు. 

తెల్లవారుజామున 4 గంటలకు ముందు కాలినడకన గ్రామానికి పడమర వైపుకు వెళ్లారు. గ్రామానికి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న జలాయశం వద్దకు వందలాది మంది చేరుకున్నారు. ఆ ప్రదేశం ఎత్తులో ఉండటం వల్ల గ్యాస్ లీక్ అయిన ప్రభావం అక్కడ కనిపించలేదు. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉన్నారు. ఆ సమయంలో పబ్ జీ ఆడటం వల్ల చాలా మంది ప్రాణాలను కాపాడగల్గిగామని యువకులు చెబుతున్నారు.