ఒమన్‌లో చిక్కుకుపోయిన మహిళ, కాపాడాలని వేడుకోలు.. రంగంలోకి దిగిన నారా లోకేశ్

తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తనను రక్షించాలని వేడుకుంటూ ఎక్స్ ద్వారా లోకేశ్ ను వేడుకున్నారు.

ఒమన్‌లో చిక్కుకుపోయిన మహిళ, కాపాడాలని వేడుకోలు.. రంగంలోకి దిగిన నారా లోకేశ్

Nara Lokesh (Photo Credit : Twitter, Facebook)

Nara Lokesh : ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తెలుగు వారు ఎందరో అక్కడ నరకయాతన చూస్తున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి అష్టకష్టాలు పడుతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు, అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అక్కడి నుంచి తిరిగి రాలేక, అక్కడే ఉండలేక తీరని వ్యధ అనుభవిస్తున్నారు. అలాంటి బాధితులకు అండగా నిలుస్తున్నారు మంత్రి నారా లోకేశ్. ఇప్పటికే ఎడారి దేశంలో(కువైట్) చిక్కుకుపోయిన నరకయాతను పడ్డ చిత్తూరు జిల్లా వాసి శివను తిరిగి స్వస్థలానికి రప్పించడంలో లోకేశ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మరో బాధితురాలి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం కోసం ఒమన్ దేశానికి వెళ్లిన మామిడి దుర్గ అనే మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. సాయం కోసం ఎదుచూస్తోంది.

ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన స్పందించారు. ఏజెంట్ల చేతిలో మోసపోయి ఒమన్ లో చిక్కుకున్న మామిడి దుర్గకు నేనున్నానంటూ నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. దుర్గను స్వస్థలానికి తీసుకొచ్చే బాధ్యతను లోకేశ్ తీసుకున్నారు. కేంద్రంతో మాట్లాడి మామిడి దుర్గను స్వస్థలానికి తీసుకొచ్చే చర్యలు తీసుకోవాలని పార్టీ ఎన్నారై విభాగానికి లోకేశ్ ఆదేశాలు ఇచ్చారు.

4 నెలల క్రితం ఏజెంట్ల ద్వారా ఒమన్ దేశం వెళ్లి చిక్కుకుపోయానంటూ మామిడి దుర్గ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు. తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. తనను రక్షించాలని వేడుకుంటూ ఎక్స్ ద్వారా లోకేశ్ ను వేడుకున్నారు. తన ఆరోగ్యం క్షీణించిందని, లేవలేని స్థితిలో ఉన్నానని, తనను రక్షించాలని ఆమె ప్రాధేయపడ్డారు. వెంటనే స్పందించిన లోకేశ్.. భయపడొద్దని భరోసా ఇచ్చారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం విదేశాంగ శాఖతో మాట్లాడి త్వరలోనే నిన్ను భారత్ కు తీసుకొస్తామని నారా లోకేశ్ ఆమెకు హామీ ఇచ్చారు.

Also Read : సీఎం చంద్రబాబు మాటలకు పగలబడి నవ్విన పవన్ కల్యాణ్..! అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం..