సీఎం చంద్రబాబు మాటలకు పగలబడి నవ్విన పవన్ కల్యాణ్..! అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం..

మహిళలను కించపరిచే వాళ్లను వదిలిపెట్టను. పబ్లిక్ లో నిలబెడతాను. ఆ విషయంలో రాజీపడను.

సీఎం చంద్రబాబు మాటలకు పగలబడి నవ్విన పవన్ కల్యాణ్..! అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం..

CM Chandrababu Naidu on Pawan Kalyan : ఏపీలో అసెంబ్లీలో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో వ్యక్తిగతంగా దూషణలు చేశారని, మహిళలను అవమానించారని చంద్రబాబు వాపోయారు. మహిళలను కించపరిచే విధంగా చాలా నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేశారని ధ్వజమెత్తారు. ఇదే సభలో తనను ఎంతగానో అవమానించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆ అవమానం తనను వెంటాడుతూనే ఉంటుందన్నారు. జీవితంలో మొట్టమొదటి సారిగా తాను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఒక్కటే ఒక్కటి ఉందని, అది సభలో తనకు జరిగిన అన్యాయం అని చంద్రబాబు అన్నారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ ను మాజీ సీఎం జగన్ వ్యక్తిగతంగా దూషించారని చెప్పారు. పవన్ ఫ్యామిలీ గురించి పదే పదే మాట్లాడి పవన్ ను విసిగించారని అన్నారు. దాంతో జగన్ కు బుద్ధి వచ్చేలా తాను కూడా ఒక మాట అన్నానని చంద్రబాబు చెప్పారు. నువ్వు ఇన్నిసార్లు పవన్ కల్యాణ్ ను కలవరిస్తున్నావు.. నువ్వు కూడా వెళ్లి కాపురం చెయ్యి అని జగన్ కు చెప్పాను అని చంద్రబాబు అనగానే.. పవన్ కల్యాణ్ పగలబడి నవ్వారు. చంద్రబాబు అన్న ఆ మాటలతో సభలోని నవ్వులు విరబూసాయి. ఇతర సభ్యులు కూడా పగలబడి నవ్వుకున్నారు.

”నాకు జరిగిన అవమానాన్ని జీవితంలో మర్చిపోలేను. నా జీవితంలో తొలిసారి కంటతడి పెట్టా. ఈ హౌస్ లోనే నాకు అన్యాయం జరిగింది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఫ్యామిలీ విషయాల పట్ల చాలా విసిగిపోయారు. జగన్ కు బుద్ధి రావాలని నేనూ ఒక మాట అన్నా. పవన్ కల్యాణ్ చట్టపరంగా పెళ్లి చేసుకున్నారు. ఇన్ని సార్లు కలవరిస్తున్నావ్. వెళ్లి పవన్ తో కాపురం చెయ్యవయ్యా అని జగన్ కి చెప్పాను. ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నించా? కుటుంబాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అని అడిగా. మహిళల మనోభావాలను కించపరిచేలా ఎవరూ మాట్లాడొద్దు. మహిళలను కించపరిచే వాళ్లను వదిలిపెట్టను. పబ్లిక్ లో నిలబెడతాను. ఆ విషయంలో రాజీపడను.

Also Read : నవ్యాంధ్ర క్యాపిటల్ అమరావతి పనులు రయ్ రయ్.. రాజధాని నిర్మాణానికి ఎన్ని రోజులు పడుతుంది?

ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. ఇన్ని రోజులు వాడు వేధించాడు. నేను కూడా వేధిస్తే మన కార్యకర్తలు తృప్తి పడతారని ఎవరూ అనుకోవద్దు. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వానిది. సేవ చేసే అవకాశం, బాధ్యత మీది. మనం చేసే ప్రతి పనిని 5 కోట్ల మంది వాచ్ చేస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది? ఇలా అన్నీ గమనిస్తున్నారు” అని ఎమ్మెల్యేలను హెచ్చరించారు చంద్రబాబు.