Kerala : కేరళలో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి 20మందికిపైగా మృతి.. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న వందలాది మంది?

కేరళ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది చిక్కుకున్నారు.

Kerala : కేరళలో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి 20మందికిపైగా మృతి.. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న వందలాది మంది?

Huge Landslides Strike in Wayanad

Wayanad Landslide : కేరళ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది చిక్కుకున్నారు. అర్థరాత్రి దాటిన తరువాత ఒంటిగంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికిపైగా మరణించగా.. వందలాది మంది మట్టిదిబ్బల కింద చిక్కుకున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వందల మంది కొండచరియల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెప్పారు.

Also Read : Jharkhand : ఝార్ఖండ్‌లో రైలు ప్ర‌మాదం.. ప‌ట్టాలు త‌ప్పిన హౌరా- సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్..

కొద్దిరోజులుగా కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెప్పాడి ముండకై ప్రాంతంలో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక్కడ వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండటంతో స్థానికులకు ఓ పాఠశాలలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాల భవనంతో పాటు.. పలు ఇళ్లు బురదలో కూరుకుపోయాయి. అందులో అనేక మంది చిక్కుకున్నట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికి చాలా మంది ఆచూకీ లభ్యంకాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయక చర్యలకోసం హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారు. మెప్పాడిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 16 మంది చికిత్స పొందుతున్నారు.

Also Read : పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా?

ముండకైలో విషాద ఘటనపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ప్రభుత్వ సంస్థలు, ఇతరత్రా యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు చెప్పారు. ఆరోగ్యశాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించింది. అత్యవసర సహాయం కోసం 9656938689, 8086010833 నెంబర్లను సంప్రదించవచ్చునని తెలిపింది.

కొండచరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల చుట్టూ నా ఆలోచనలు తిరుగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ సీఎం పినరయి విజయన్ తో మాట్లాడి కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని చెప్పామని మోదీ అన్నారు. మరోవైపు మృతులకు 2 లక్షల, గాయపడిన వారికి 50 వేల పరిహారంను ప్రధాని కార్యాలయం ప్రకటించింది.

 లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. వాయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీ కొండచరియలు విరిగిపడటంతో నేను తీవ్ర వేదనకు గురయ్యాను. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తారని ఆశిస్తున్నాను. కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని, సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని కోరాను. కేంద్ర మంత్రులతోనూ మాట్లాడి వాయనాడ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరతాను. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో అడ్మినిస్ట్రేషన్‌కు సహాయం చేయాలని నేను యూడీఎఫ్ కార్యకర్తలందరినీ కోరుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు.