పాలస్తీనా అగ్రనేతలను ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం వెనకున్న ప్లాన్ ఏంటి.. అసలేం జరుగుతోంది?

ఇజ్రాయెల్‌తో పాలస్తీనా మిలిటెంట్ వార్.. మరోసారి అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలకు కారణమవనుందా? మిడిల్ ఈస్ట్‌లో అసలేం జరుగుతోంది?

పాలస్తీనా అగ్రనేతలను ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం వెనకున్న ప్లాన్ ఏంటి.. అసలేం జరుగుతోంది?

why israel targets hamas chief Ismail Haniyeh explained here

Israel hamas conflict: ఇజ్రాయెల్‌తో పాలస్తీనా మిలిటెంట్ వార్.. మరోసారి అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలకు కారణమవనుందా? హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్యతో మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముంటున్నాయా? ఇంతకీ ఎవరీ హమాస్ చీఫ్ హనియే. ఎందుకు ఇజ్రాయెల్ అతడిని వెంటాడి.. వేటాడి మట్టుబెట్టింది? దీనిపై ఇరాన్ ఎలా స్పందించనుంది..? ఇజ్రాయెల్‌పై ప్రతీకారానికి ఇరాన్ పథకరచన చేస్తోందా? దాన్ని తిప్పికొట్టేందుకే ఇజ్రాయెల్ ఇలా అగ్రనేతలను టార్గెట్ చేస్తోందా? అసలేం జరుగుతోంది?

శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ఇజ్రాయెల్
గాజాలో మిలిటెంట్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది ఇజ్రాయెల్. వరుస ప్రతీకార దాడులతో రెచ్చిపోతోంది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇప్పుడు ఇరాన్‌లోనే హమాస్ చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హనియెను మట్టుబెట్టింది. దీంతో గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌తో పోరాటం చేస్తున్న హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యిది. హమాస్ సంస్థ చీఫ్.. 62 ఏళ్ల ఇస్మాయిల్ హనియె ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. హమాస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీనిని ఇజ్రాయెల్ దాడిగా అభివర్ణించింది. టెహ్రాన్‌లోని ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియె, ఆయన బాడీగార్డ్ ఇద్దరూ మృతి చెందారు. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంటికి వచ్చిన సమయంలోనే ఇజ్రాయెల్ ఇలా దాడులకు దిగి హమాస్ చీఫ్‌ను హతమార్చడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

హమాస్‌లో కీలక పాత్ర
ఇస్మాయిల్ హనియె 1963లో గాజా సిటీకి సమీపంలోని ఓ శరణార్థి శిబిరంలో పుట్టాడు. 1980ల చివర్లో తొలి ఇంతిఫాదా సమయంలో హమాస్‌లో చేరాడు హనియె. 1989లో పాలస్తీనా మొదటి తిరుగుబాటు అణచివేత సమయంలో హనియెను ఇజ్రాయెల్ మూడేళ్లపాటు జైల్లో పెట్టింది. 1990లో తొలిసారిగా హనియె పేరు వెలుగులోకి వచ్చింది. 1992లో మరికొంతమంది హమాస్ నాయకులతో పాటు బహిష్కరణకు గురైన హనియె.. ఇజ్రాయెల్ – లెబనాన్ మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఉండాల్సి వచ్చింది. ఏడాది బహిష్కరణ తర్వాత గాజాకి తిరిగి వచ్చారు. హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు హనియె అత్యంత సన్నిహితుడు. రాజకీయపరమైన సలహాలిస్తూ ఆయనకు కుడి భుజంగా ఉండేవాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ సంస్థలో అనేక హోదాల్లో పనిచేశాడు. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హతమయ్యాడు. ఆ తర్వాత.. హమాస్‌లో కీలక పాత్ర పోషించాడు హనియె.

హమాస్ శిబిరంలో కలవరం
జాతీయ ఎన్నికల్లో హమాస్ అత్యధిక సీట్లు గెలుచుకున్న తర్వాత, అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ 2006లో హనియెను పాలస్తీనా ప్రధాన మంత్రిగా నియమించారు. పాలస్తీనా స్టేట్ ప్రధానిగా ఎంపికై గాజా స్ట్రిప్‌ను పాలించాడు. వారం రోజుల హింసాకాండ కారణంగా ఏడాదికే ఆయన తన పదవిని కోల్పోయారు. 2007 జూన్లో పాలస్తీనా నేషనల్ అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ అతడిని పదవి నుంచి తొలగించారు. తన పదవి నుంచి తొలగించడం ”రాజ్యాంగ విరుద్ధం” అంటూ తిరస్కరించారు. పాలస్తీనా ప్రజలపై తమ బాధ్యతలను, తమ ప్రభుత్వం విస్మరించదంటూ గాజాలో పాలన కొనసాగించారు. అప్పట్నుంచి గాజాలో ఫతా-హమాస్ యుద్ధం జరుగుతోంది. దీంతో అబ్బాస్ ఆదేశాలను పక్కనపెట్టి గాజాలో ప్రధాని బాధ్యతల్లో కొనసాగాడు హనియె.

Also Read: పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్‌కు చైనా సపోర్ట్ వెనుక ఇంత కుట్ర ఉందా?

2017 మే 6న హమాస్ పొలిటికల్ బ్యూరోకి అధినేతగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అమెరికా అతడిని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో గాజా స్ట్రిప్‌ను వీడి అప్పటి నుంచి ఖతర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హనియె ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు, మనవరాళ్లు మరణించినట్లు అప్పట్లో హమాస్ ప్రకటించింది. కుటుంబసభ్యులను కోల్పోయినా ఇజ్రాయెల్‌పై పోరాటం ఆగద్దొని అప్పట్లో హనియె అన్నాడు. బందీల విడుదల, గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాల్లో ఇతడు కీలకంగా వ్యవహరించిన హనియెను ఇప్పుడు ఇజ్రాయెల్ లేపేసింది. దీంతో హమాస్ శిబిరంలో కలవరం మొదలైంది.

Also Read: అణు రహస్యాలను దొంగిలించేందుకు ఉత్తర కొరియా హ్యాకర్ల ప్రయత్నాలు

మరోపక్క ఈ హత్యతో అంతర్జాతీయంగా మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. తమదేశంలో అతిథిగా ఉన్న అగ్రనేతను చంపేయటాన్ని ఇరాన్ తీవ్రంగా పరిగణించే వీలుంది. అదే జరిగితే ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలే ఎక్కువ. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ తెలిపింది.

లెబనాన్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్
హనియె హత్యతో ఇజ్రాయెల్ లెబనాన్‌కు కూడా గట్టి హెచ్చరికలే పంపింది. ఈమధ్యే ఇజ్రాయెల్ లోని గోలన్ హైట్స్ మజ్దాల్ షమ్స్ ఫుట్బాల్ మైదానంపై లెబనాన్ రాకెట్ దాడులకు దిగింది. ఈ ఘటనలో 12 మంది పిల్లలు చనిపోయారు. దీనికి కూడా తగిన బుద్ధి చెబుతామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. లెబనాన్‌లో హెజ్బొల్లాకు ఇరాన్ నుంచి సైనిక శిక్షణ, ఆయుధాల సరఫరా పుష్కలంగా ఉన్నాయి. దీనికి తోడు సిరియా పాలకుల నుంచి సాయం అందుతోంది. దీన్ని కూడా ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. ఇప్పుడు హమాస్ చీఫ్ హత్యతో వీరికి కూడా డెత్ వార్నింగ్ ఇస్తోంది ఇజ్రాయెల్.

ప్రతీకారం తీర్చుకుంటామన్న హమస్
హనియె మరణంపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ముసా అబు మర్జుక్ ఓ ప్రకటన విడుదల చేశాడు. ఇది కుట్రపూరిత చర్య అని.. దీనికి బదులు తప్పదు అంటూ ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకునే దిశగా హెచ్చరికలు చేసింది హమాస్. ఇజ్రాయెల్ వైమానిక దాడిలోనే తమ చీఫ్ ఇస్మాయిల్ హనియె మృతి చెందాడని హమాస్ స్పష్టం చేసింది. అటు ఈ హత్య ఘటనను పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ కూడా తీవ్రంగా ఖండించారు. హనియె మృతి కథనాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ తెలుసుకుంది. అయితే, వాటిపై స్పందించేందుకు మాత్రం శ్వేతసౌధం నిరాకరించింది.