వృద్ధులే టార్గెట్, అందమైన అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్.. రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు

ఈ వ్యవహారం గురించి బయటికి చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో డబ్బు పోగొట్టుకున్నా బాధితులు మిన్నకుండిపోతున్నారు.

వృద్ధులే టార్గెట్, అందమైన అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్.. రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు

Cyber Crime (Photo Credit : Google)

Cyber Crime : సైబర్ నేరగాళ్లు తమ రూట్ మార్చారు. కొత్త తరహా మోసాలకు తెరలేపారు. ఈసారి సైబర్ క్రిమినల్స్ కన్ను వృద్ధులపై పడింది. అమ్మాయిలతో వాట్సాప్ వీడియో కాల్స్ చేయిస్తారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు. బాధితుల నుంచి లక్షలు దండుకుంటున్నారు. కొత్త తరహా సైబర్ మోసాల గురించి కృష్ణా జిల్లా పెనమలూరు సీఐ రామారావు వివరాలు వెల్లడించారు.

రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన సైబర్ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్ చేసుకుని లక్షలు దండుకుంటున్నారని ఆయన తెలిపారు. తొలుత వాట్సప్ వీడియో కాల్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ కాల్ ఎత్తిన వెంటనే అమ్మాయిలు కనిపిస్తారు. వారు నగ్నంగా ఉంటారు. వారి ఒంటి మీద నూలుపోగు కూడా ఉండదు. అమ్మాయిలు మూడు, నాలుగు నిమిషాలు వృద్ధులతో చాటింగ్ చేస్తారు. సీన్ కట్ చేస్తే వాట్సాప్ కు ఆ వీడియోని పంపిస్తారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది.

మేము పోలీసులం అంటూ వృద్ధులకు ఫోన్ కాల్స్ వస్తాయి. వీడియో చూపి బ్లాక్ మెయిల్ చేస్తారు. 10 లక్షలు నుండి 20 లక్షల వరకు డిమాండ్ చేస్తారు సైబర్ నేరగాళ్లు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వీడియోని సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తారు. వారి మాటలకు భయపడి బాధితులు అడిగినంత డబ్బు ఇచ్చుకుంటున్నారు. కాగా, రిటైర్ అయిన ఉద్యోగులని సైబర్ గ్యాంగ్ టార్గెట్ చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం గురించి బయటికి చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో డబ్బు పోగొట్టుకున్నా బాధితులు మిన్నకుండిపోతున్నారు.

కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా ఘటనలు వెలుగు చూసినట్లు పోలీసులు వెల్లడించారు. మాకు వచ్చి చెబుతున్నారు కాని ఫిర్యాదు మాత్రం చేయడం లేదని పోలీసులు తెలిపారు. బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ సీఐ రామరావు పేర్కొన్నారు.

Also Read : ఏలూరులో సైబర్ మోసం.. 25 లక్షలు పోగొట్టుకున్న మహిళా టీచర్