Paris Olympics 2024 : ఆశలన్నీ లక్ష్యసేన్ పైనే.. పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపపర్చిన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు

పారిస్ ఒలింపిక్స్ కచ్చితంగా పతకం గెలిచేలా కనిపించిన ఆంధ్ర కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ కు చుక్కెదురైంది. చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ పురుషుల డబుల్స్ క్వార్టర్స్ దశలోనే

Paris Olympics 2024 : ఆశలన్నీ లక్ష్యసేన్ పైనే.. పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపపర్చిన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు

PV Sindhu and Lakshya Sen

Paris Olympic 2024 : పారిస్ ఒలింపిక్స్-2024లో భారత్ అభిమానులకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. పెద్దగా అంచనాల్లేని స్వప్నిల్ కుశాలె అదరగొట్టాడు. షూటింగ్ విభాగంలో భారత్ కు మూడో పతకం సాధించిపెట్టాడు. అభిమానుల్లో ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఆ తరువాత తమతమ విభాగాల్లో సత్తాచాటుతారని భావించిన స్టార్ ప్లేయర్లు ఓటమితో నిరాశపర్చారు. నిఖత్ జరీన్, పి.వి. సింధు, సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓటమిపాలయ్యారు. ఈ నలుగురిలో ముగ్గురు తెలుగు రాష్ట్రాల క్రీడాకారులే కావడం విశేషం.

Nikhat Zareen

నిఖత్ జరీన్ తెలంగాణ బాక్సర్. వరుసగా రెండేళ్లు ప్రపంచ ఛాంపియన్, జూనియర్ స్థాయిలోనూ ప్రపంచ విజేత. తొలిసారి ఒలింపిక్స్ లో ఆడుతున్న నిఖత్ జరీన్ పారిస్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధిస్తుందని అందరూ ఆశించారు. కానీ, నిఖత్ నిరాశపర్చింది. 50కేజీల విభాగం ప్రీక్వార్టర్స్ లో చైనా బాక్సర్, ఆసియా క్రీడల స్వర్ణ విజేత వు హు చేతిలో 0-5తేడాతో ఓడిపోయింది. ఓటమి తరువాత నిఖత్ మాట్లాడుతూ.. అందరూ నన్ను మన్నించండి.. ఇది నాకొక పాఠం. ఒలింపిక్స్ కోసం చాలా కష్టపడ్డాను. కానీ ఇక్కడ కలిసి రాలేదు. తిరిగి పుంజుకుంటాను అని పేర్కొంది.

PV Sindhu

బ్యాడ్మింటన్ విభాగంలో పీవీ సింధూ ఏదోఒక పతకాన్ని కైవసం చేసుకుంటుందని భావించినప్పటికీ ఆమెకూడా నిరాశపర్చింది. రియోలో రజతం, టోక్యోలో కాంస్యం పతకాలు సాధించిన పి.వి.సింధూ.. పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం అభిమానుల ఆశలను కూల్చేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రీక్వార్టర్స్ లో ఆమె చైనా యువతి హే బిన్ జియావోపై పరాజయం పాలైంది. మ్యాచ్ అనంతరం సింధూ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ లో విజయం సాధించనందుకు బాధగా ఉంది. నివారించదగిన కొన్ని తప్పులు మ్యాచ్ లో కొనసాగాయి. అవి ప్రత్యర్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని పీవీ సింధూ అన్నారు.

Satwik-Chirag

పారిస్ ఒలింపిక్స్ కచ్చితంగా పతకం గెలిచేలా కనిపించిన ఆంధ్ర కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ కు చుక్కెదురైంది. చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ పురుషుల డబుల్స్ క్వార్టర్స్ దశలోనే ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాడు. హోరాహోరీగా సాగిన పోరులో సాత్విక్ -చిరాగ్ జంట మలేసియాకు చెందిన చియా -వూయ్ యిక్ చేతిలో పరాజయం పాలైంది. ప్రస్తుతం భారత్ క్రీడాభిమానుల ఆశలన్నీ లక్ష్యసేన్ పైనే ఉన్నాయి. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్స్ లో లక్ష్యసేన్ పైచేయి సాధించాడు. భారత్ కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్ ను లక్ష్యసేన్ ఓడించి క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు. క్వార్టర్స్ లో అతను చైనీస్ తైపీ ఆటగాడు చౌ తియెన్ చెన్ ను ఢీకొట్టనున్నాడు.

పారిస్ ఒలిపింక్స్ 2024లో గురువారం వరకు భారత్ క్రీడాకారులు మూడు పతకాలు సాధించారు. అందులో మూడు కాంస్య పతకాలే. ఈ మూడు కూడా షూటింగ్ విభాగంలోనే వచ్చాయి. ఒకే ఒలింపిక్స్ లో షూటింగ్ లో అత్యధిక పతకాలు రావడం ఇదే తొలిసారి. 2012లో (విజయ్ కుమార్, గగన్ నారంగ్) రెండు పతకాలు సాధించారు. ఈ ఒలింపిక్స్ లో ఆ రికార్డును బ్రేక్ చేశారు.