శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు

ఎడమ కాలువకు 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఒకేసారి చెరువులు నింపడంతో పాటు రైతులకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు భారీగా వరద నీరు

Nagarjuna Sagar Dam : శ్రీశైలం డ్యామ్ నుంచి భారీ వరద చేరికతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలో ఉంది. ప్రాజెక్ట్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 575 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ప్రస్తుతం దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి ప్రాజెక్ట్ కు చేరుకుంది. రేపు ప్రాజెక్ట్ లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేశారు. ఎగువ నుంచి వచ్చే భారీ వరదతో నీటిమట్టం 585 అడుగులకు చేరితే ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు.

అయితే క్లస్టర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలినా.. ఆయకట్టు రైతులకు అవసరమైన సాగునీటి విడుదల విషయంలో పరిమితులు విధించడం పట్ల స్థానిక రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎడమ కాలువకు ప్రస్తుతం కేవలం 4వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. చెరువులు నింపే వరకు రైతులు నీటిని మళ్లించొద్దని ఆంక్షలు విధించారు. ఎడమ కాలువకు 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి ఒకేసారి చెరువులు నింపడంతో పాటు రైతులకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

తెలుగు రాష్ట్రాల వరద ప్రదాయినిగా పేరు గాంచిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. ప్రాజెక్ట్ నిండు కుండను తలపిస్తోంది. ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో భారీగా ఉంది. రేపు సాయంత్రం వరకు ప్రాజెక్ట్ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 585 అడుగులు దాటిన తర్వాత ఏ క్షణమైనా క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ కుడి కాలువ, ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశారు. కుడి కాలువకు 6వేల క్యూసెక్కులు, ఎడమ కాలువకు 4వేల క్యూసెక్కుల నీరు వదులుపుతున్నారు. జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా దాదాపు 20వేలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దాదాపు 30వేల క్యూసెక్కుల పై చిలుకు ఔట్ ఫ్లో ఉంది.

Also Read : శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు, పర్యాటకులు