Breast feeding Week: బ్రెస్ట్ ఫీడింగ్ వీక్.. హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్‌లో వాకథాన్‌..

శిశువుల ఆరోగ్యానికి, తల్లుల సాధికారతకు తల్లిపాలు ఎంతో కీలకమని..

Breast feeding Week: బ్రెస్ట్ ఫీడింగ్ వీక్.. హైదరాబాద్‌ కేబీఆర్ పార్క్‌లో వాకథాన్‌..

బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాల్లో (ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు) భాగంగా హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌ వేదికగా ఫెర్నాండెజ్ హాస్పిటల్ ‘వాకథాన్‌’ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. తల్లి పాలివ్వడం, దాని ప్రాధాన్యాన్ని తెలియజేయడం, తల్లులకు ఈ విషయం పైన అవగాహన కల్పించడం… ప్రోత్సహించడం ఈ వాకథాన్ లక్ష్యం.

ఈ సంవత్సరం థీమ్ “క్లోజింగ్ ది గ్యాప్: బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్”లో భాగంగా ఈ కార్యక్రమం సందేశాన్ని అందించింది. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభం కాగా.. పాల్గొనే ఔత్సాహికులు కేబీఆర్ పార్క్‌కి చేరుకున్నారు. ఇందులో భాగంగా తల్లిపాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు, సవాళ్లను వివరించే స్లొగన్స్ తో పాటు తల్లిపాల అవగాహనను పెంపొందించే ప్లకార్డులను పట్టుకుని కేబీఆర్ పార్క్ మార్గంలో నడిచి వాకథాన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫెర్నాండెజ్ ఫౌండేషన్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, సోషల్ ఇనిషియేటివ్స్ హెడ్ డాక్టర్ ప్రమోద్ మాట్లాడుతూ.. శిశువుల ఆరోగ్యానికి, తల్లుల సాధికారతకు తల్లిపాలు ఎంతో కీలకమని, అన్ని విధాలుగా తల్లిపాలకు మద్దతునిచ్చే, ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడం మన కర్తవ్యమని అన్నారు.

ఫెర్నాండెజ్ హాస్పిటల్‌లోని నియోనాటాలజీ విభాగం హెడ్ డాక్టర్ తేజోప్రతాప్ ఒలేటి మాట్లాడుతూ.. తమ కృషి తల్లులు, వారి పిల్లల జీవితాలలో గణనీయమైన మార్పును తెస్తుందని అన్నారు. ఇందులో భాగస్వామ్యం అయిన వారు తమ కమ్యూనిటీల్లో తల్లి పాలివ్వడాన్ని కొనసాగించాలని, భవిష్యత్ లోనూ అవగాహన కల్పిస్తూ ఉంటామని ప్రతిజ్ఞ చేయడంతో ఈ వాకథాన్ ముగిసింది.

Also Read: వృద్ధుల్లో డిమెన్షియా.. స్మార్ట్ వాచ్‌తో ఎక్కడున్నా ఈజీగా ట్రాక్ చేయొచ్చు!