అక్కడి రాజకీయాల్లో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు.. ఆ బాధ్యతలను బొత్సకు అప్పగించాలని డిమాండ్

పార్టీ పరంగా ఉత్తరాంధ్ర బాధ్యతలను బొత్సకు అప్పగించాలని డిమాండ్ ఎక్కువవుతోంది.

అక్కడి రాజకీయాల్లో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు.. ఆ బాధ్యతలను బొత్సకు అప్పగించాలని డిమాండ్

Botsa Satyanarayana (Photo Credit : Google)

ఎమ్మెల్సీ బొత్స.. 30 ఏళ్లలో ఎన్నో పదవులు అధిష్టించారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి….. ఒకానొక దశలో సీఎం పదవికి పోటీపడ్డారు. దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఉత్తరాంధ్రలో తనకంటూ ఓ పొలిటికల్ సామ్రాజ్యాన్నే స్థాపించారు. కానీ, ఈ సుదీర్ఘ ప్రయాణంలో బొత్స ఊహించని విజయం ఎమ్మెల్సీగా ఏకగ్రీవం…!

పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా, అధికార పార్టీ గేట్లు ఎత్తితే ఎందరు ఉంటారో, ఎవరు హ్యాండిస్తారో తెలియని పరిస్థితుల్లో రంగంలోకి దిగి చాకచక్యంగా ఏకగ్రీవం చేసుకోవడం బొత్స మార్కు రాజకీయం. ఎవరు ఔనన్నా.. కాదన్న బొత్సకు మాత్రమే ఈ విజయం సాధ్యం. మరి ఇలాంటి ఘన విజయం సాధించిన బొత్సకు వైసీపీలో ఎలాంటి స్థానం దక్కబోతోంది? ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స రోల్ మారుతుందా…?

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ద్వారా వైసీపీకి ఓదార్పు దక్కింది. ఓటమి నేర్పిన పాఠంతో ప్రయోగాలకు పోకుండా… బొత్స వంటి సమర్థుడైన నాయకుడిని రంగంలోకి దింపి ఎన్నికను ఏకగ్రీవం చేసుకోగలిగింది వైసీపీ. దీనికి వైసీపీ అధినేత జగన్ సత్వర నిర్ణయం ఒక కారణమైతే… బొత్స సమర్థత అంతకు మించి అని చెబతున్నారు… వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి ఉత్తరాంధ్రలో బొత్స ప్రభావం మొదలయ్యాక… ఆ కంచుకోటకు నెమ్మదిగా బీటలు వారాయి…. కానీ, గత ఐదేళ్లలో బొత్స వంటి సీనియర్లను వెనక్కి నెట్టి వలస నేతలకు పెద్దరికం ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధించింది.

ఉత్తరాంధ్రలో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు
రాష్ట్రంలో ఇతర ప్రాంతాల రాజకీయాలకు… ఉత్తరాంధ్ర పాలిటిక్స్‌కు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో డబ్బుతో రాజకీయాలను శాసించొచ్చునేమో కానీ, ఉత్తరాంధ్రలో డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. స్థానికంగా అందుబాటులో ఉన్న నేతలు… సామాజికవర్గాలు, బంధువులు, స్నేహతులు… ఇలా ఎన్నో అంశాలు ప్రభావం చూపుతాయి. కుల బలం లేకపోయినా, సమర్థతతో ఈ ప్రాంతంలో రాజకీయాలు చేసేవారు చాలా మంది ఉన్నారు.

అందుకే ఎక్కడెక్కడి నుంచి వచ్చినా విశాఖలో ఎంపీలుగా స్థానికేతరులు గెలుస్తుంటారు. కానీ, ప్రజాసేవ చేయాల్సిన నేతలు… తమపై పెద్దరికం చేయడాన్ని ఉత్తరాంధ్ర వాసులు సహించరు. ఈ కారణంతోనే గత ఎన్నికల్లో వైసీపీకి ఓటమి రుచిచూపించారని అంటుంటారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో అనూహ్య విజయం దక్కించుకున్న వైసీపీ… ఆ తర్వాత స్థానికేతులైన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటివారికి ఉత్తరాంధ్రలో పెద్దరికం ఇచ్చింది.

ఇది ఈ ప్రాంతీయులకు ఎంతమాత్రం నచ్చలేదని చెబుతారు. ఇదేసమయంలో కొన్ని అనివార్యతల కారణంగానే బొత్సకు ప్రాధాన్యమిచ్చినా… పార్టీలో ప్రభుత్వంలో ఆయన అధికారాలకు కోత ఉండేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితులే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణమయ్యాయని విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఓటమి తర్వాత పోస్టుమార్టం జరిగిందో లేదో కానీ, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బొత్సను రంగంలోకి దింపడం ద్వారా చేసిన తప్పును సరిదిద్దుకుంది వైసీపీ. బలం ఉంది కదా అని, బొత్సకు బదులుగా వేరెవరిని పోటీకి పెట్టినా ఫలితం ఇంకోలా ఉండేదని చెబుతున్నారు పరిశీలకులు.

ఈ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్
ఇక వైసీపీకి అనూహ్యం విజయం సాధించి పెట్టిన బొత్స భవిష్యత్ రాజకీయంపై చర్చ మొదలైంది. వైసీపీలో అగ్రశ్రేణి నాయకుడైన బొత్సకు కీలక బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ వినిపిస్తోంది. శాసనమండలిలో వైసీపీకి దాదాపు 40 మంది సభ్యుల బలం ఉంది. దీంతో మండలిలో ప్రతిపక్ష నేత పదవికి చాలా ప్రాధాన్యం ఏర్పడింది. మండలి పక్ష నేతగా వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డిని ఇటీవలే నియమించింది పార్టీ. ఐతే బొత్స వంటి సీనియర్ మండలిలో అడుగుపెట్టడం వల్ల ఇప్పుడా నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తుందా? లేదా? అన్నది చూడాల్సివుందంటున్నారు.

ప్రతిపక్ష నేతగా బొత్సను నియమిస్తే… వైసీపీకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీల్లో దాదాపు పది నుంచి పదిహేను మంది అధికార పార్టీకి దగ్గరవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మండలిలో వైసీపీకి బొత్స నాయకత్వం వహిస్తే…. గోడదూకేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్సీలను నిలువరించవచ్చు అంటున్నారు. బొత్స రాజకీయ చాణక్యం, వ్యూహాలు… చతరుత వేరేగా ఉంటాయంటారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర విభజన వంటి అంశాలను చాకచక్యంగా డీల్ చేసిన బొత్స సేవలను ఎంత సమర్థంగా వాడుకోగలిగితే… పార్టీకి అంత ప్రయోజనం ఉంటుందని వైసీపీలో చర్చ జరుగుతోంది. అధిష్టానం ఈ దిశగా ఆలోచిస్తుందా? లేదా? అన్నది చూడాల్సివుంది.

ఇక పార్టీ పరంగా ఉత్తరాంధ్ర బాధ్యతలను బొత్సకు అప్పగించాలని డిమాండ్ ఎక్కువవుతోంది. ఉత్తారంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాల్లో బొత్సకు బలం, బలగం ఉంది. ఎమ్మెల్సీగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే… మూడు జిల్లాల నుంచి బొత్స అనుచరులు విశాఖలో వాలిపోవడం వల్లే ఎన్నిక ఏకగ్రీవమైందని చెబుతున్నారు. అధికార కూటమికి ఓటర్లు చిక్కకుండా ఒత్తిడికి గురిచేయడం వల్లే టీడీపీ వెనక్కి తగ్గిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ విషయంలో ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యులు చేసిందేమీ లేదంటున్నారు.

వైసీపీ వైఫల్యమేనా?
విశాఖ కార్పొరేషన్లో వైసీపీకి పూర్తి బలం ఉన్నప్పటికీ.. స్టాండింగ్ కౌన్సిల్లో ఒక్కటీ గెలుచుకోకపోవడం వైసీపీ వైఫల్యంగా చెబుతున్నారు. ఇదే బొత్సకు… ఇతర వలస నేతలకు తేడాగా చెబుతున్నారు. ఇక విశాఖ లోక్‌సభ అభ్యర్థిగా పోటీచేసిన బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడు బొత్స స్థానిక ఎమ్మెల్సీగా ఉండటం వల్ల జిల్లా రాజకీయాలు పూర్తిగా ఆయన చేతుల్లోకి వెళ్లిపోయినట్లే అంటున్నారు… ఈ పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో ఆయనకు పూర్తి పవర్స్ ఇస్తే వచ్చే ఎన్నికలకు పార్టీ పుంజుకోవడం ఖాయమని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి వైసీపీ అధినేత జగన్ ఆలోచనలు ఏంటో? బొత్సకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాల్సివుంది.

Also Read: వాణినే డోర్లు బద్దలు కొట్టారు.. ఆవిడ వల్లనే మాకు హాని పొంచి ఉంది: దివ్వల మాధురి