హైడ్రా దూకుడు.. ఇప్పటివరకు 70 భవనాలు కూల్చివేత
చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారు అధికారులు.

Hydra : హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు 70 భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూల్చివేశారు హైడ్రా అధికారులు. నిన్న గండిపేటలోని ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపించారు. ఒక్క గండిపేటలోనే 20కి పైగా భవనాలను కూల్చేశారు. చందానగర్ సర్కిల్ మదీనాగూడ చెరువులో 3, బాచుపల్లిలోని ఎర్రకుంటలో 3, గాజులరామారంలో 42 భవనాలను నేలమట్టం చేశారు. చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారు అధికారులు.
ఇప్పటివరకు 70 వరకు నిర్మాణాలు నేలమట్టం..
హైదరాబాద్ నగరంలో చాలా కాలంగా ఉన్న అక్రమ కట్టడాలను కూల్చే పనిలో అధికారులు ఉన్నారు. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న నిర్మాణాలు, ప్రహరీలు కూల్చగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎత్తైన నిర్మాణాలను, మూడు నాలుగు అంతస్తుల భవనాలను కూల్చివేశారు. నిన్న గండిపేట, ఖానాపూర్ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఆ ప్రాంతాల్లో దాదాపుగా 20 నిర్మాణాలను కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. బాచుపల్లి మున్సిపల్ పరిధి, కూకట్ పల్లి ప్రాంతంలోని మదీనాగూడ లేక్ పరిసర ప్రాంతాలు, గాజులరామారం, ఓల్డ్ సిటీలోని రాజేంద్రనగర్ లో పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు అధికారులు. ఇప్పటివరకు దాదాపు 70 వరకు నిర్మాణాలను కూల్చేశారు.
గంటల వ్యవధిలోనే నేలమట్టం..
చాలా ఏళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో నిర్మాణాలను కూల్చడం జరిగింది. గతంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కూల్చివేతలు చేసినప్పుడు.. కేవలం చిన్న చిన్న రంధ్రాలు వేయడం, కాంపౌండ్ వాల్ నో, గేట్ పక్కన ఉండే గోడనో కూల్చేసి వెళ్లేవారు. ఇప్పుడు మాత్రం అలా కాకుండా పూర్తి స్థాయిలో భవనాలను నేలమట్టం చేస్తున్నారు. రెండు మూడు అంతస్తులతో నిర్మించిన భవనాలను సైతం భారీ యంత్రాలతో కూల్చేస్తున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే పూర్తిగా నిర్మాణాలను నేల కూలుస్తున్నారు.
పక్కా ప్రణాళికతో, భారీ పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు..
గతంలో నిర్మాణాలు కూల్చే సమయంలో చాలా గందరగోళం ఉండేది. కూల్చివేతలను అడ్డుకునే వారు. పోలీసులు వారిని నిలువరించలేకపోయేవారు. ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి లేదు. హైడ్రా అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కూల్చివేతల సమయంలో ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. మీడియాను కూడా అనుమతించడం లేదు. కేవలం డీఆర్ఎస్, హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మాత్రమే అక్కడుంటున్నారు. కూల్చివేత పనులు మొదలైన కొన్ని గంటల వ్యవధిలోనే పూర్తి చేస్తున్నారు. బాచుపల్లి ప్రాంతంలో అర్థరాత్రి వేళ అందరూ నిద్రపోయిన సమయంలో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు అధికారులు.
Also Read : ఒక్కొక్కరు 30-40 మంది ఎమ్మెల్యేలను కూడగట్టే పనిలో ఉన్నారు- కాంగ్రెస్ మంత్రులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు