Turmeric : పసుపులో దుంప, వేరుకుళ్లు తెగులు , నివారణ చర్యలు !

ఎకరానికి 2కిలోల ట్రైకోడర్మా విరిడిని 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువులో కలిపి వారం రోజుల పాటు అనువైన పరిస్ధితిలో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదంటే విత్తిన నెలరోజులకు నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి.

Turmeric : పసుపులో దుంప, వేరుకుళ్లు తెగులు , నివారణ చర్యలు !

Turmeric :

Turmeric : సుగంధ ద్రవ్య పంటలలో ప్రధానమైనది పసుపు, తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో పసుపు పంటను సాగు చేస్తున్నారు. ఆహార పదార్ధాలతో పాటు, ఔషదాల తయారీలో , చర్మ సౌందర్యానికి దీనిని ఉపయోగిస్తారు. నీరు ఇంకే గరపనేలలు, ఉదజని సూచిక 6 నుండి 7.5 మధ్య ఉండే సేంద్రీయ పదార్ధం ఉన్న భూములు పసుపు పంటకు అనుకూలం. పసుపు పంటలో వచ్చే తెగుళ్ళ విషయం తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వీటిపై రైతుల సరైన అవగాహన కలిగి ఉండాలి. పసుపు పంటకు వ్యాపించే తెగుళ్ళలో దుంప వేరుకుళ్ళు తెగులు కూడా ఒకటి.

ఈ దుంప వేరుకుళ్ళు తెగులునే కొమ్ము కుళ్ళు , అడుగు రోగం అని కూడా అంటారు. ఈ తెగులు సోకితే నష్టం అధికంగా ఉంటుంది. దిగుబడి 50 నుండి 60శాతం తగ్గుతుంది. జులైలో మొదలై అక్టోబర్, నవంబర్లో దీని తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ తెగులు సోకటానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

1. తెగులు సోకిన పంట పొలంలో పండిన పసుపు విత్తనాన్ని తిరిగి వాడటం వల్ల ఇది ఆశిస్తుంది.

2. విత్తనశుద్ధి చేయకపోవటం వల్ల , విత్తన పసుపును లోతుగా నాటటం వల్ల కూడా వస్తుంది.

3. పొటాష్ , వేపపిండి ఎరువులను సక్రమంగా వాడకపోవటం వల్ల వస్తుంది.

4. మురుగు నీరు పోయే సౌకర్యంలోని నేలల్లో పసుపు పంట సాగు చేయటం కూడా కారణమే

లక్షణాలు ;

1. పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎదుగుదల లేక, ఆకులు పసుపు రంగులోకి మారి మాడిపోయినట్లు కనిపిస్తాయి.

2. మొక్కల్లో తొలుత ముదురు ఆకులు వాడిపోయి, గోధుమ రంగుకు మారి ఎండిపోతాయి. తరువాత మొక్క పైభాగాన ఉన్న లేత ఆకులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. పొలంలో తెగులు సుడులు సుడులుగా కనిపిస్తుంది.

3. మొక్క కాండంపై నీటతో తడిసిన మాదిరిగా మచ్చలు ఏర్పడతాయి. మచ్చలు తరువాత గోధుమ రంగుకు మారతాయి.

4. వేర్లు నల్లబడి కుళ్లిపోతాయి. తెగులు సోకిన మొక్కకు వేర్లు , కొమ్మలు మళ్ళీ పుట్టవు. దుంపలు కొమ్ములు కుళ్లి మెత్తబడిపోతాయి. వాడి నుండి చెడు వాసన వస్తుంది. లోపల పసుపు రంగుకు బదులుగా మట్టి రంగు ఉంటుంది. ఈ తెగులు తల్లి దుంపల నుండి పిల్ల దుంపలకు వ్యాపిస్తుంది.

5. పసుపు దిగుబడి , నాణ్యత తగ్గుతుంది. తెగులు సోకిన మొక్కలను పీకితే కొమ్ములతో పాటు తేలికగా వస్తాయి.

నివారణ చర్యలు ;

1. తెగులు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. చీడపీడలు, తెగులు సోకని పొలం నుండి విత్తనాన్ని సేకరించి నాటుకోవాలి.

2. విత్తనశుద్ధి కి సంబంధించి ముందుగా లీటరు నీటికి 3గ్రా మెటలాక్సిల్ మరియు 2మి.లీ మోనో క్రోటోఫాస్ లేదా 3గ్రా మాంకోజెబ్ మరియు 2మి.లీల మోనో క్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో కొమ్ములను 30 నిమిషాలు నానబెట్టాలి. తరువాత నీటిని మార్చి లీటరు నీటికి 10గ్రా ల ట్రైకోడర్మా విరిడి కలిపి ఆ ద్రావణంలో 30 నిమిషాలు కొమ్ములను నానబెట్టి తరువాత బయటకు తీసి నీడలో ఆరబెట్టి పొలంలో విత్తుకోవాలి.

3. ఎకరానికి 2కిలోల ట్రైకోడర్మా విరిడిని 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువులో కలిపి వారం రోజుల పాటు అనువైన పరిస్ధితిలో వృద్ధి చేసి ఆఖరి దుక్కిలో లేదంటే విత్తిన నెలరోజులకు నీటి తడి ఇచ్చిన వెంటనే చల్లాలి.

4. ఏటా ఒకే నేలలో వరుసగా పసుపు వేయరాదు. జొన్న , మొక్కజొన్న , వేరుశనగ, వరి లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి.

5. పసుపు విత్తిన తరువాత నేలపై పచ్చి ఆకులతో లేదంటే ఎండు ఆకులతో మల్చింగ్ చేస్తే తెగులు ఉదృతిని తగ్గించవచ్చు. వర్షాలు కురిసిన సందర్భంలో పొలంలో నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాలి.

6. తెగులు లక్షణాలు గుర్తించిన వెంటనే లీటరు నీటికి 1గ్రా మెటాలాక్సిల్ మరియు మాంకోజెబ్ లేదంటే 2గ్రా కాఫ్టాన్ లేదంటే 3గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్ ను కలిపి తెగులు సోకిన మొక్కల చుట్టూ మొదళ్లు తడిచేలా పోయాలి.