Country Chicken: గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నాటుకోళ్ల పెంపకం

కోడి ధర ఘాటెక్కినా.. రుచి మాత్రం భలే హాటు అంటూ మాంసాహారులు లొట్టలు వేసుకొని తింటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది నాటుకోళ్ల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా మార్చు కుంటున్నారు.

Country Chicken: గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన నాటుకోళ్ల పెంపకం

Cock Meat

Country Chicken: నాటుకోడి మాంసానికి రోజురోజుకు డిమాండ్‌ పెరుగుతోంది. కొవ్వు శాతం తక్కువగా ఉండడం, పోషకాలు అధికంగా ఉండడంతో నాటుకోడి మాంసం తినేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. కోడి ధర ఘాటెక్కినా.. రుచి మాత్రం భలే హాటు అంటూ మాంసాహారులు లొట్టలు వేసుకొని తింటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది నాటుకోళ్ల పెంపకాన్ని కుటీర పరిశ్రమగా మార్చు కుంటున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు ఫ్రీరేంజ్ పద్ధతిలో నాటుకోళ్లు, పందెం కోళ్ల పెంపకం చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు.

మారుతున్న పరిస్థితులకు, అందుబాటులోకి వస్తున్న సాంకేతికతకూ అనుగుణంగా వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త ఆలోచన సరికొత్త ఆచరణ దిశగా తొలి అడుగులేయిస్తుంది. ఆ అడుగులు వెలుగుబాటలు వేసి పలువురికీ మార్గదర్శకమవుతాయి. ఇందుకు నిదర్శనమే కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం, రేమల్లె గ్రామ రైతు కొండపావులూరి శాస్త్రి. సపోట పండ్ల తోటల్లోనే నాటు కోళ్లను పెంచుతూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నారు.

రైతు శాస్త్రికి వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఆరున్నర ఎకరాల సపోటతోటను మూడేళ్ల క్రితం లీజుకుతీసుకున్నారు. ఒక తోటపైనే ఆధారపడకుండా అనుబంధంగా నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. మరోవైపు సంక్రాంతి సమయంలో పందెంకోళ్లకు ఉన్న డిమాండ్ ను గుర్తించి మేలు జాతి కోళ్ల పెంపకం కూడా చేపట్టారు. పందెం కోళ్లను ఇనుప జాలిలో పెంపకం చేపడుతుండగా, నాటుకోళ్లను ఫ్రీరేంజ్ పద్ధతిలో పెంచుతున్నారు.

రైతు శాస్త్రి కోళ్లను సహజ పద్ధతిలో గుడ్లను పొదిగించి పిల్లను ఉత్పత్తి చేస్తున్నారు. అందరిలా గుడ్లు, పిల్లలను అమ్మకుండా, పెద్ద కోళ్లను మాత్రమే అమ్ముతూ.. నెలకు అన్ని ఖర్చులు పోను దాదాపు లక్షరూపాయల ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ కోళ్ల పెంపకంలో వారి తల్లి చేదోడు వాదోడుగా నిలుస్తోంది.