Betel Plantations : తగ్గిపోతున్న తమలపాకు తోటల సాగు
రోజు రోజుకు తమలపాకు తోటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది. తెగుళ్లు, తుఫాను గాలుల వలన తీవ్ర నష్టాలు వస్తున్నాయి. వీటికి తోడు కూలీల కొరత.. రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటంతో రైతులు వీటి సాగుకు విముఖత చూపుతున్నారు.

Betel leaf Cultivation
Betel Plantations : పూజకైనా.. పెండ్లికైనా.. తమలపాకు లేనిదే పని జరగదు. తమలపాకు తాంబూలం పవిత్రంగా భావిస్తుంటారు. అంతేకాదు ఆరోగ్య సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం. ఇప్పటికీ చాలామంది భోజనం తర్వాత తమలపాకు నమలడం మాత్రం మరిచిపోరు. కానీ ఆ తమలపాకు సాగుపై ఆధారపడి రైతులకు ఇప్పుడు కష్టం వచ్చి పడింది. పెట్టుబడులు పెరిగిపోయాయి. మార్కెట్ లో ధరలు పడిపోయాయి. దీంతో గిట్టుబాటు కావడం లేదంటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా తమలపాకు రైతులు.
READ ALSO : Brinjal Crop : వంగతోటలను నష్టపరుస్తున్న వెర్రితెగులు.. నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు
విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలో సాగు అయ్యే తమలపాకు అంటే దేశంలోనే చాలా రాష్ట్రంలో ప్రసిద్ధి. ఎక్కడ ఎంత పంట పడినా పాయకరావుపేటలోని తమలపాకు కు ఉండే డిమాండ్ వేరు. దాదాపు ఇక్కడ 4 నుండి 5 వేల ఎకరాల్లో తమలపాకు సాగు జరుగుతుంది. అయితే ఇక్కడి నుండి 25 ఏళ్ల క్రితం కృష్ణా జిల్లా, కంకిపాడు మండలం, రొయ్యూరు గ్రామానికి వలస వచ్చిన కొన్ని రైతు కుటుంబాలు .. భూములను కౌలుకు తీసుకొని తమలపాకు సాగుచేస్తున్నారు. రోజురోజుకు పెట్టుబడులు పెరిగిపోతుండటం.. మార్కెట్ లో ఆకులకు ధర తగ్గడంతో… రైతులు తమలపాకు సాగు గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజు రోజుకు తమలపాకు తోటల సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోతుంది. తెగుళ్లు, తుఫాను గాలుల వలన తీవ్ర నష్టాలు వస్తున్నాయి. వీటికి తోడు కూలీల కొరత.. రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటంతో రైతులు వీటి సాగుకు విముఖత చూపుతున్నారు. పాన్ మసాలాల ప్రభావంతో తమలపాకుల వినియోగం తగ్గటంతో గిరాకీ పడిపోయింది. సాగు ఖర్చులు పెరిగిన స్థాయిలో ధర లేకపోవటం కూడా కారణమంటున్నారు.