Sunflower Cultivation : పొద్దుతిరుగుడు సాగులో అధిక దిగుబడులకోసం…

పొద్దు తిరుగుడు సాగులో ప్రధానంగా చీడపీడల సమస్య రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే వేడి వాతావరణంలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. బూడిద తెగులు ఆకులపైన, ఆకుల అడుగుభాగాన

Sunflower Cultivation :  పొద్దుతిరుగుడు సాగులో అధిక దిగుబడులకోసం…

Sunflower

Sunflower Cultivation : నూనె గింజల సాగులో వేరుశెనగ తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటల్లో ప్రొద్దుతిరుగుడు పంట కూడా ఒకటి. పొద్దు తిరుగుడు సాగుకు అన్ని కాలాలు అనుకూలంగా ఉంటాయి. తక్కువ పెట్టుబడి, తక్కువ కాలపరిమితి ఉండడంతో చాలామంది రైతులు పొద్దు తిరుగుడు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో వ్యవసాయశాఖ అధికారులు పంట మార్పిడిలో బాగంగా పొద్దతిరుగుడు సాగు చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు.

తక్కువ నీరు, కొద్దిపాటి పెట్టుబడితో పొద్దుతిరుగుడు సాగు చేపట్టవచ్చు. తక్కువ వ్యవధిలోనే పంట చేతికి వస్తుంది. పంట వ్యవధి మూడు నెలలకాగా, ఎకరాకు 12వేల రూపాయల పెట్టుబడి పెడితే 35వేల నుండి 45వేల వరకు అదాయం పొందవచ్చు. కొద్ది పాటి యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి రైతులకు పొద్దుతిరుగుడు పంట మంచి అదాయం సమకూరుస్తుంది.

పొద్దు తిరుగుడు సాగులో ప్రధానంగా చీడపీడల సమస్య రైతులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తేమ ఎక్కువగా ఉండే వేడి వాతావరణంలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. బూడిద తెగులు ఆకులపైన, ఆకుల అడుగుభాగాన బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి.తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ, డైనోకాప్ లేదా 2 మి.లీ, హెక్సాకొనజోల్ కలిపి పిచికారి చేయాలి

పొద్దు తిరుగుడులో మరో సమస్య రసం పీల్చే పురుగుల ఉదృతి. పురుగులు ఆకులలో రసం పీల్చి మొక్కలు గిడసబారి పోయేలా చేస్తాయి. వీటి నివారణకు థయోమిథాక్సామ్ 0.5 గ్రా, 5 మి.లీ. వేప నూనెను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్‌ 8 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

పొగాకు లద్దెపురుగు పొద్దుతిరుగుడు పంటను ఆశిస్తుంది. పైరు మొదటి దశలో ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయడం వల్ల ఉధృతిని తగ్గించవచ్చు. పురుగు ఉదృతి ఎక్కువగా ఉన్న యెడల నొవాల్యూరాన్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేక విషపు ఎరను 5 కి. తౌడు మరియు 1/2 కిలో బెల్లం మరియు 1/2 లీ. మోనోక్రోటోపాస్ లేక క్లోరిపైరిఫాస్ ఉండలుగా తయారుచేసి సాయంత్రం వేళల్లో పొలంలో అక్కడక్కడ ఉంచాలి.ఈ తెగులు తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే నెక్రోసిస్ తెగులు వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల పువ్వులు విచ్చుకోకుండా మెలితిరిగి ఉంటాయి. వీటి నివారణలో పార్టీనియం కలుపును తొలగించుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేదా థయోమిథాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే తెగులును అదుపులో ఉంచవచ్చు.

మొక్కలు పుష్పించే దశలో శనగపచ్చ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. శనగపచ్చ పురుగు లార్వాలు పువ్వులు, గింజల మధ్య చేరి వాటిని తింటూ తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ పురుగు నివారణకు ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు యొక్క ఉధృతిని బట్టి ధయోడికార్బ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని సమూలంగా నిర్మూలించవచ్చు.

పొద్దుతిరుగుడు పంటకు పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది. రామచిలకలు ఎక్కువగా పంటలపై వాలి నష్టం కలిగిస్తాయి. పక్షులను బెదరగొట్టేందుకు మెరుపు రిబ్బన్లను చేను పైభాగంలో కట్టాలి. శబ్ధాలు చేయడం, దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా పక్షుల బెడదను తగ్గించవచ్చు. అడవి పందులు కూడా పంటపై దాడి చేసే అవకాశం ఉంంది. పంట చుట్టూ గుంజలు పాతి ఇనప తీగను చుట్టడం ద్వారా అడవి పందులు రాకుండా చూసుకోవచ్చు. సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే ఎకరాకు 12 క్వింటాళ్ళకు పైగా దిగుబడి పొందవచ్చు.