విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఘటనలో హైకోర్టు కీలక ఆదేశాలు

  • Published By: srihari ,Published On : May 24, 2020 / 03:09 PM IST
విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఘటనలో హైకోర్టు కీలక ఆదేశాలు

విశాఖ ఎల్ జీ పాలిమర్స్ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్ గ్యాస్ ను తరలించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అత్యంత ప్రమాదకరమైన గ్యాస్ ను జనావాసాల మధ్య ఎలా స్టోర్ చేశారని ప్రశ్నించింది. కంపెనీ డైరెక్టర్లు తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని, వారు తమ పాస్ పోర్టును సమర్పించాలని ఆదేశించింది. 

కంపెనీ పరిసరాలను సీజ్ చేయాలని తెలిపింది. డైరెక్టర్లతో సహా ఎవరికీ లోపలకు అనుమతించొద్దని అధికారులకు సూచించింది. గ్యాస్ దుర్ఘటనపై దర్యాప్తు జరుపుతన్న కమిటీలు మాత్రమే కంపెనీలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. అయితే వారు ఆ వివరాలను రికార్డ్ బుక్స్ లో పేర్కొనాలని హైకోర్టు ఆదేశించింది. లాక్ డౌన్ తర్వాత కార్యకలాపాలు ప్రారంభించేందుకు కంపెనీ ఎవరి అనుమతి తీసుకుందో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరింది. 

ప్రభుత్వం కంపెనీకి వత్తాసు పలుకుతుందని బాధిత గ్రామాల ప్రజలు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం తమకు సరిపోవడం లేదని ఆందోళన కూడా చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఎక్కడే గానీ దర్యాప్తులో పొరపాట్లు జరుగకుండా చాలా సందర్భాల్లో పరిశీలిస్తే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు డైరెక్టర్లు, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారు విదేశాలకు పారిపోవడం జరుగుతుంది. 

పారిపోయిన వారిని మళ్లీ ఇక్కడికి తీసుకరావడంలో చాలా ఆలస్యం కావడంతో అది కూడా కుదరని పరిస్థితులను నెలకొన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ విషయంలో హైకోర్టు అలాంటి పొరపాట్లు జరుగకుండా కచ్చితంగా దర్యాప్తు జరగాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు.