Bhadrachalam Ramalayam Land : భద్రాద్రి రాములోరి భూములు అన్యాక్రాంతం..ఆక్రమణకు గురవుతున్న వందలాది ఎకరాలు

భద్రాద్రి రాములోరికి సంబంధించిన వందల ఎకరాల మాన్యం..అన్యాక్రాంతమవుతోంది. దేవుడి భూములు కూడా కబ్జా కోరల్లో చిక్కుకోవడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

Bhadrachalam Ramalayam Land : భద్రాద్రి రాములోరి భూములు అన్యాక్రాంతం..ఆక్రమణకు గురవుతున్న వందలాది ఎకరాలు

Bhadrachalam Ramalayam Land

Bhadrachalam Ramalayam land : కష్టమొస్తే.. దేవుడిని తలచుకుంటాం. భారమంతా.. ఆ భగవంతుడి మీదే వేసి ముందుకు కదులుతాం.  కానీ.. ఇప్పుడు ఆ దేవుడికే కష్టమొచ్చింది. భద్రాద్రి రాములోరికి సంబంధించిన వందల ఎకరాల మాన్యం..అన్యాక్రాంతమవుతోంది. దేవుడి భూములు కూడా కబ్జా కోరల్లో చిక్కుకోవడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు.. రాములోరి భూముల్లో జరుగుతున్నదేంటి?

రామయ్య శబరి ఎంగిలి చేసిన పళ్లను తిన్నాడు. గుహుడుని.. ఏకంగా గుండెలకు హత్తుకున్నాడు. కానీ.. వందల ఎకరాల తన మాన్యం.. అన్యాక్రాంతమవుతుంటే మాత్రం.. ఆ రాముడు స్పందించడం లేదు. భద్రాద్రి రాములవారి ఆలయానికి సంబంధించిన వందల ఎకరాల భూమి అన్యాక్రాంతమవుతోంది. 100 కాదు 200లు కాదు.. ఏకంగా 9 వందల ఎకరాల దేవుడి మాన్యానికి ఎసరు పెట్టడం.. తెలంగాణ, ఏపీలో సంచలనంగా మారింది. ఇంత జరుగుతుంటే.. అధికారులు ఏం చేస్తున్నారని భక్తుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. కానీ.. వాళ్లు మాత్రం ఏం చేయగలరు? వాళ్లకు తెలిసింది కూడా ఇప్పుడే.దేవుడి భూముల్ని కాపాడేంత గొప్పవాళ్లమా మనం అనుకొని ఉంటారు అధికారులు. రాములోరి భూముల్ని.. ఆ రామయ్యే భద్రంగా చూసుకుంటాడులే అని.. వీళ్లనుకోవచ్చు. అందుకే.. జాగ్రత్తగా చూసుకోవాల్సిన దేవుడి మాన్యాన్ని.. పట్టించుకోవడమే మానేశారు అధికారులు. నిజానికి.. రాములోరికి వందల ఎకరాల మాన్యం ఉందన్న విషయమైనా గుర్తుందో.. లేదో.. అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడీ.. వార్త బయటకొచ్చాకే.. దేవుడి భూములు అన్యాక్రాంతమవుతున్న విషయం తెలిసింది.

పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న రాములవారికి 900 ఎకరాల భూమి..
రాములోరి భూములు కబ్జాకు ఎలా గురయ్యాయో.. తెలియాలంటే కొన్నేళ్లు వెనక్కి వెళ్లి.. కొన్ని పేజీలు వెనక్కి తిప్పాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో ఏడు మండలాలను ఏపీలో కలిపారు. అందులో.. భద్రాచలానికి ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నం గ్రామం కూడా ఆంధ్రాలో కలిసింది. ఈ ఒక్క ఊళ్లోనే రాములవారికి 900 ఎకరాల భూములున్నాయ్. ఇందుకు సంబంధించిన.. హక్కు పత్రాలు కూడా అధికారుల దగ్గరున్నాయ్. అయితే.. విభజన సమయంలో రాములోరి భూమి ఏపీ భూభాగంలోకి వెళ్లిపోవడంతో.. తెలంగాణ అధికారులు పట్టించుకోలేదు. భద్రాచలం రామాలయం.. తెలంగాణలో ఉండటంతో.. ఏపీ అధికారులు, పోలీసులు ఈ భూమి వైపు కన్నెత్తి చూడలేదు. రెండు రాష్ట్రాల అధికారులు పట్టించుకోకపోవడంతో.. రాములోరి భూములపై అక్రమార్కులు కన్నేశారు. పదుల ఎకరాలు ఆక్రమించుకున్నారు.

రాములోరి భూముల్ని పంచేసుకున్న స్థానికులు..
భద్రాచలం ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని తెలుసుకున్న శ్రీరామ్‌నగర్, కొల్లుగూడెం గ్రామస్తులు కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురాలేదు. పైగా.. ఆ భూముల్లో కొంత మేర.. తాము కూడా ఆక్రమించేద్దామనుకున్నారు. తమను అడిగేవాళ్లు ఎవరున్నారని.. వాళ్లు కూడా కొంత భూమిని ఆక్రమించేశారు. రామాయణం థీమ్ పార్క్ ఏర్పాటు చేయడానికి కేటాయించిన 50 ఎకరాల ఖాళీ ప్రదేశంలో.. నీకింత భూమి.. నాకింత భూమి అంటూ.. వాళ్లలో వాళ్లే పంచేసుకున్నారు. అక్కడితో ఆగకుండా.. హద్దులు కూడా పాతుకున్నారు. హద్దులు కూడా పాతేశాక.. ఇక తమను అడ్డుకునేదెవరు అనుకున్నారో ఏమో కొందరు ఆక్రమణదారులు.. రాములోరి భూమిలో గుడిసెలు కూడా వేసేశారు. ఇంత జరుగుతున్నా.. ఇటు తెలంగాణ అధికారులకు గానీ.. అటు ఆంధ్రా అధికారులకు గానీ.. అక్కడేం జరుగుతుందో కూడా తెలియదు. ఈ వార్త బయటకొచ్చాకే.. వాళ్లకూ అసలు విషయం తెలిసింది.రాములోరి భూముల ఆక్రమణపై.. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. భద్రాచలం ఆలయ ఈవో స్పందించారు. భూములు అన్యాక్రాంతం అవడంపై.. పోలీసులతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌కు కంప్లైంట్ చేశారు. దీంతో.. ఆక్రమణదారులతో పోలీసులు చర్చలు జరిపారు. ఆలయ భూముల్లో నిర్మాణాలు జరిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా రాములోరి భూముల కబ్జా
తాజాగా బయటపడ్డ ఈ కబ్జా బాగోతం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి.. భద్రాచలం ఆలయానికి.. దేవుడి మాన్యం కింద మొత్తం 1350 ఎకరాల భూమి ఉంది. ఇందులో.. 917 ఎకరాలు భద్రాచలం పక్కనే ఉన్న పురుషోత్తపట్నంలో ఉంది. రాష్ట్ర విభజన సమయంలో.. ఈ గ్రామం ఏపీలో కలిసిపోయింది. ప్రస్తుతం ఈ ప్రాంతం.. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఉంది. పురుషోత్తపట్నంలో ఉన్న 917 ఎకరాల్లో.. 15 ఎకరాల్లో కరకట్ట నిర్మాణం, ఇళ్లు కోల్పోయిన వారికోసం.. స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కొంత భూమిని తీసుకుంది. ఇందుకు.. దేవాదాయశాఖకు కొంతమేర డబ్బులు కూడా చెల్లించింది. ప్రస్తుతం.. అక్కడ 899 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. పర్ణశాలలోనూ.. రాములోరికి భూములున్నాయ్.

గోదావరి జిల్లాల్లో కూడా రాములోరి భూములు
పురుషోత్తపట్నమే కాదు.. గుంటూరు, విజయవాడతో పాటు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ.. భద్రాచలం రాములోరికి భూములున్నాయ్. మెదక్ జిల్లా దంతాలపల్లిలో ఉన్న 232 ఎకరాలపై.. కోర్టు వివాదం నడుస్తోంది. పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో.. 109 ఎకరాలు గోశాలకు కేటాయించారు. మిగిలిన 659 ఎకరాల భూమిని.. ఎకరాకు 4 వేల చొప్పున రైతులకు కౌలుకిచ్చారు. 2018వ సంవత్సరం వరకు రైతులు కౌలు చెల్లించారు. ఆ తర్వాత ఏమైందో.. అధికారులకే తెలియాలి.

భద్రాచలానికి ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నంలో వందల ఎకరాల రాములోరి భూమి ఆక్రమణదారులకు వరంలా మారింది. దేవస్థాన అధికారుల దగ్గర.. రామయ్య భూములకు సంబంధించి.. అన్ని హక్కు పత్రాలు ఉన్నప్పటికీ.. రెండు రాష్ట్రాలు వేరవడం, భూములు ఏపీ పరిధిలో ఉండటంతో.. తెలంగాణ పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. అటు ఏపీ, ఇటు తెలంగాణ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల.. రాములోరి మాన్యం అన్యాక్రాంతమైంది.

ఆక్రమణలను తొలగించిన పోలీసులు..
భద్రాచలం ఆలయ భూములు కబ్జాకు గురయ్యాయని తెలిసి.. ఆ ప్రాంతంలో ఉన్న ఆక్రమణలను పోలీసులు తొలగించారు. అక్కడ భారీ బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు.. రాములోరి భూములు ఆక్రమించిన శ్రీరామ్ నగర్ కాలనీవాసులు.. తమకు భూములు లేకపోవడం వల్లే.. అక్కడ గుడిసెలు వేసుకున్నామని చెబుతున్నారు. అయితే.. భూములు అన్యాక్రాంతమైన విషయం బయటకు రావడంతో.. పురుషోత్తపట్నంలో భారీ పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. ఆక్రమణదారులను ఏపీ పోలీసులు తప్పించారు.

రామాయణం థీమ్ పార్క్‌కు కేటాయించిన 50 ఎకరాల భూమిని శ్రీరామ్‌నగర్‌కాలనీ, కొల్లుగూడెం గ్రామస్తులు ఆక్రమించడంతో.. తెలంగాణ దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులు పురుషోత్తపట్నం చేరుకున్నారు. భూములు కబ్జా కాకుండా చర్యలు చేపట్టారు.ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు చేపట్టకుండా పోలీసులు మోహరించారు. అయితే.. ఎప్పటికప్పుడు భూములను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడమే.. అవి అన్యాక్రాంతమవడానికి కారణమంటున్నారు రాములోరి భక్తులు. వందలాది ఎకరాలను ఉపయోగంలోకి తెస్తే.. ఆలయానికి అదనపు ఆదాయం సమకూరుతుందంటున్నారు.