AP Govt: నేడు జిల్లా పరిషత్‌ చైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక!

నేడు ఏపీ రాజకీయాలలో మరో కీలక ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. ఒక్క చైర్మన్లు మాత్రమే కాదు..

10TV Telugu News

AP Govt: నేడు ఏపీ రాజకీయాలలో మరో కీలక ఎన్నికలు జరగనున్నాయి. అధికార పార్టీ వైసీపీ ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పరిషత్ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది. ఒక్క చైర్మన్లు మాత్రమే కాదు.. వైస్ ఛైర్మన్ల ఎన్నికకు రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీటీసీలు సమావేశమై జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఆయా పదవులకు అభ్యర్థులను ఖరారు చేసిన అధికార వైసీపీ ఎన్నిక కోసం విప్ జారీ చేయనుంది. మరోవైపు ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.

రకరకాల ట్విస్టుల మధ్య పరిషత్ ఎన్నికల ఫలితాలను ఇప్పటికే ప్రకటించినందున జిల్లా పరిషత్‌ చైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు (శనివారం) నిర్వహించనుంది. ఆశావహులు, అభ్యర్థుల నుంచి ఉదయం 10 గంటలలోపు నామినేషన్లు స్వీకరించనుండగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అనంతరం ముందుగా కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక చేపట్టనున్న అధికారులు మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్మన్‌, ఇద్దరు వైస్ ఛైర్మన్ల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నుకోనున్నారు.

రాష్ట్రంలో అన్ని పరిషత్‌ కార్యాలయల్లో సమావేశం కానున్న జడ్పీటీసీలు, ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాపరిషత్ ఛైర్మన్ పదవులు అధికార పార్టీకే దక్కనుండగా.. రిజర్వేషన్ల వారీగా ఇప్పటికే సీఎం జగన్ అభ్యర్థులను ఖరారు పూర్తి చేశారు. గతంలో మండల పరిషత్‌ ఎన్నికల సందర్భంగా తలెత్తిన విభేదాలను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ పరిషత్ అభ్యర్థులను ఎలాంటి అసంతృప్తికి తావులేకుండా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.