తీవ్ర విషాదం.. తనకిష్టమైన ఆట ఆడుతూ మృతిచెందిన సీఐ

పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో తీవ్ర విషాదం అలుముకుంది. తనకు ఎంతో ఇష్టమైన షటిల్ ఆట ఆడుతూ కోర్టులోనే కన్నుమూశారు గణపవరం సీఐ డేగల భగవాన్ ప్రసాద్.

తీవ్ర విషాదం.. తనకిష్టమైన ఆట ఆడుతూ మృతిచెందిన సీఐ

Ganapavaram Ci

ganapavaram ci dies playing game : పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో తీవ్ర విషాదం అలుముకుంది. తనకు ఎంతో ఇష్టమైన షటిల్ ఆట ఆడుతూ కోర్టులోనే కన్నుమూశారు గణపవరం సీఐ డేగల భగవాన్ ప్రసాద్. ఆయన వయసు 42ఏళ్లు. విధులు ముగించుకున్న తర్వాత సాయంత్రం వేళ నిడమర్రు మండలం బువ్వనపల్లిలో షటిల్ ఆడేందుకు భగవాన్ ప్రసాద్ వెళ్లారు. కాసేపు షటిల్ ఆడారు. ఇంతలోనే షటిల్ కోర్టులోనే ఒక్కసారిగా ఆయన కుప్పకూలారు. వెంటనే సహచరులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సీఐ చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. గుండెపోటుతో సీఐ చనిపోయినట్లు తెలిపారు.

సీఐ భగవాన్ కి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. 2003లో కానిస్టేబుల్‌గా ఆయన ప్రస్థానం ప్రారంభిచారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి సీఐ స్థాయికి ఎదిగారు. 2007లో ఆర్‌ఎస్ఐగా ఎంపికయ్యారు. 2009లో సివిల్‌ ఎస్ఐగా చేరారు. 22.10.2011 నుంచి 14.11.2012 మధ్య కాలంలో గణపవరం స్టేషన్ లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. తిరిగి పదోన్నతిపై సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా 2019 జులై 10 నుంచి గణపవరంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ప్రాంతంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది.

లా అండ్‌ ఆర్డర్‌ అమలు, ట్రాఫిక్‌ ఇబ్బందుల తొలగింపులో తనదైన ముద్ర వేశారు. ప్రజల గుండెల్లో అభిమానం సంపాదించారు. సీఐ భగవాన్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తోటి సిబ్బంది ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.