East Godavari: హృదయాన్ని కదిలించే విషాదం.. కుటుంబాన్ని కోల్పోయిన బాలుడు!

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో విరుచుపడి ఎందరినో బలితీసుకున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించని దెబ్బకు కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.. పిల్లలను కోల్పోయిన పేరెంట్స్.. ఒకరికి దహనసంస్కారాలు చేసేలోపు అదే కుటుంబంలో మరో మరణం ఇలా ఎన్నో కుటుంబాలలో హృదయాన్ని పిండేసే విషాదాన్ని నింపింది.

East Godavari: హృదయాన్ని కదిలించే విషాదం.. కుటుంబాన్ని కోల్పోయిన బాలుడు!

East Godavari

East Godavari: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో విరుచుపడి ఎందరినో బలితీసుకున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించని దెబ్బకు కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు.. పిల్లలను కోల్పోయిన పేరెంట్స్.. ఒకరికి దహనసంస్కారాలు చేసేలోపు అదే కుటుంబంలో మరో మరణం ఇలా ఎన్నో కుటుంబాలలో హృదయాన్ని పిండేసే విషాదాన్ని నింపింది. కాగా ఒకేసారి కుటుంబంలో ఐదుగురిని కోల్పోయి ఒంటరైన ఓ బాలుడి కథ ఇప్పుడు హృదయాన్ని కదిలిస్తుంది.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని శివకోడు గ్రామానికి చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ మేడిచర్ల వి.సుధీర్‌రాయ్‌ తన భార్య శ్వేత హరిత, తల్లి ఉమామహేశ్వరి, కుమారుడు సాయి సత్య సహర్షతో కలిసి ఉంటున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సుధీర్ రాయ్ దంపతులతో పాటు తల్లికి కరోనా సోకింది. ముగ్గురినీ ఆసుపత్రిలో చేర్పించిన
శ్వేత సోదరుడు రాజీవ్ మేనల్లుడైన సహర్షను చూసుకుంటున్నాడు. అయితే.. చికిత్స తీసుకుంటూనే ఏప్రిల్ 25న సుధీర్ రాయ్, మే 4న ఉమామహేశ్వరి, మే 9న శ్వేత హరిత మృతి చెందారు.

తల్లిదండ్రులు, నాయనమ్మ చనిపోయిన విషయాన్ని బాలుడికి చెప్పలేని మేనమామ రాజీవ్ దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నాడు. కానీ ఈలోగా రాజీవ్ తల్లిదండ్రులైన, బాలుడి అమ్మమ్మ, తాతయ్యలకు కూడా వైరస్ సోకడంతో వారిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రైవేట్ ఆసుపత్రిలో రూ.28 లక్షలు ఖర్చుచేసినా అమ్మమ్మ, తాతయ్యలు కూడా చనిపోయారు. దీంతో రెండు కుటుంబాలలో మేనమామ, మేనల్లుడు మిగిలారు. ఇప్పటికీ తల్లిదండ్రులు, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు వస్తారన్న ఆశతో బాలుడు ఎదురుచూస్తున్నాడు.

తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన తెలిసిన అందరినీ కంటతడి పెట్టిస్తుండగా విషయం తెలుసుకున్న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, సహర్ష ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఒకే ఇంట్లో ఐదుగురు కరోనాతో మృతి చెందడం బాధాకరమన్న ఎంపీ.. ప్రైవేట్ ఆస్పత్రికి చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు సహర్ష పేరుమీద బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామన్నారు. అలాగే సహర్షను కేంద్రీయ విద్యాలయంలో చేర్పిస్తానని హామీ ఇచ్చారు.