Andhra Pradesh Rains: ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో 48గంటలు భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ తెలిపింది.

Andhra Pradesh Rains: ఏపీలో దంచికొడుతున్న వానలు.. మరో 48గంటలు భారీ వర్షాలు

Andhra Pradesh Rains: తెలుగు రాష్ట్రాల్లో వద్దంటే వానలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. భారీ వానలతో ఏపీ, తెలంగాణ తడిసి ముద్దవుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలు పడుతుండగా.. మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటలు భారీ వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడినప్పటికీ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా, రాష్ట్రంలో మరో రెండురోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ తెలిపింది.

రేపు (అక్టోబరు 7) రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఎల్లుండి (అక్టోబరు 8) రాయలసీమ, ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ అధికారులు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్ష సూచన ఉన్న జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

అటు.. ఉపరితల ద్రోణి, విదర్భ ప్రాంతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేశారని చెప్పారు. పలు జిల్లాల్లో మరో 48 గంటల పాటు వానలు పడతాయని చెప్పారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారని అన్నారు. ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆ జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు.