Kamineni Srinivas: కామినేని శ్రీనివాస్ మైండ్‌గేమ్‌తో కైకలూరు టీడీపీలో కలవరం!

మాజీ మంత్రి, సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ రాజకీయ ఎత్తులతో టీడీపీ, జనసేన నాయకుల్లో కలవరం ఎక్కువవుతోంది.

Kamineni Srinivas: కామినేని శ్రీనివాస్ మైండ్‌గేమ్‌తో కైకలూరు టీడీపీలో కలవరం!

kamineni srinivas mind game in kaikaluru politics

Kamineni Srinivas: ఆయనో సీనియర్ నేత.. రాజకీయాల్లో తలపండిన నాయకుడు. తెలుగుదేశంలో (Telugu Desam Party) రాజకీయ జీవితం ప్రారంభించి కమలం గూటికి చేరిన ఆ నేతకు అగ్రనేతల వద్ద మంచి పరపతి ఉంది. టీడీపీ, ప్రజారాజ్యం, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా నాలుగు పార్టీల్లో పనిచేసిన ఆ నేత వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని అంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థిని.. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని తానేనని ప్రకటించుకుంటున్నారు. బీజేపీలో ఉంటే టీడీపీ టిక్కెట్ ఎలా వస్తుంది? జనసేన ఎలా బరిలో నిలుపుతుందని ఎవరికైనా అనుమానం రావొచ్చు.. కానీ ఆ నేత చాణక్యం తెలిస్తే ఎవరైనా విస్తు పోవాల్సిందే.. దటీజ్ కామినేని అనాల్సిందే. ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పొలిటికల్ ట్రిక్స్‌తో కైకలూరు (kaikaluru) టీడీపీలో కలవరం మొదలైంది.

మాజీ మంత్రి, సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ రాజకీయ ఎత్తులతో టీడీపీ, జనసేన నాయకుల్లో కలవరం ఎక్కువవుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ మాదే అని ధీమాగా ఉన్న నేతలు.. కామినేని పాలిట్రిక్స్‌తో హడలిపోతున్నారు. నాలుగున్నరేళ్లుగా తాము పార్టీ కోసం పోరాడి.. ఎన్నో కష్టాలు పడితే చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి ఎక్కడ టిక్కెట్ తన్నుకుపోతారోనని మదనపడుతున్నారు కైకలూరు తెలుగు తమ్ముళ్లు.. జనసైనికులు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ మంత్రి కామినేని వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నారు. ఐతే బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదని భావిస్తోన్న కామినేని.. టీడీపీ, జనసేన పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలకు ఎమ్మెల్యే అభ్యర్థుల కొరత ఉందని కామినేని భావిస్తున్నారట.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ (Jayamangala Venkata Ramana) వైసీపీలో చేరడం.. సమర్థులైన నేతలు లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థినంటూ పెత్తనం చలాయిస్తున్నారట కామినేని. బీజేపీలో ఉన్న కామినేని తన ఇంటి నుంచి టీడీపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం హాట్‌టాపిక్ అవుతోంది.

కామినేనికి టీడీపీ అగ్రనేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అదేవిధంగా గతంలో ప్రజారాజ్యంలో పనిచేసినందున జనసేన అధినేత పవన్‌తో కూడా సత్ససంబంధాలే ఉన్నాయట. ఇక ప్రస్తుతం బీజేపీలో ఉన్నందున ఆయనకు తిరుగులేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో (Janasena Party) బీజేపీ కలిస్తే.. బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయడానికి లేదంటే మిగిలిన రెండు పార్టీల్లో ఏ పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీ టిక్కెట్ తీసుకోడానికి పావులు కదుపుతున్నారు కామినేని. మూడు పార్టీలతోనూ తనకు సన్నిహిత సంబంధాలు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో కైకలూరులో విపక్ష అభ్యర్థిగా పోటీ చేయడం పక్కా అంటూ తన అనుచరులతో చెబుతున్నారు కామినేని.

Also Read: విజయసాయిరెడ్డి మాయాజాలంపైనే ఒంగోలు వైసీపీ భవిష్యత్.. ఏం చేస్తారో?

కామినేని ఇలా చెబుతుండటంతోనే మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ టీడీపీని వీడి వైసీపీలో చేరినట్లు చెబుతున్నారు. తాను పనిచేస్తే.. ఆఖరి క్షణంలో కామినేనికి టిక్కెట్ తన్నుకుపోతారనే భయమే జయమంగళ వెంకటరమణను ఫ్యాన్ పార్టీలో చేరేందుకు ఉసిగొల్పిందని చెబుతున్నారు టీడీపీ కార్యకర్తలు. ఇక ప్రస్తుతం పార్టీకి ఇన్‌చార్జిగా ఎవరూ లేకపోయినా నాయకులంతా సమష్టిగా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ నంబూరి వెంకటరమణరాజు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు (pinnamaneni venkateswara rao), కొల్లేరుకు చెందిన సీనియర్ నేత ఏసుబాబు, యువ నాయకుడు కొడాలి వినోద్‌బాబు (Kodali Vinod) టీడీపీ టిక్కెట్ ఆశిస్తున్నారు. తమలో ఎవరో ఒకరిని ఇన్‌చార్జిగా నియమించాలని కోరుతున్నారు.

Also Read: తల్లిని ఎవరు తిట్టకపోయినా కేసులు పెట్టిన లోకేష్.. ఇప్పుడు తండ్రి మీద వచ్చిన కథనంపై కేసులు వేస్తారా : మంత్రి గుడివాడ

కానీ, కామినేని ఈ నేతలతో సంబంధం లేకుండా నేరుగా కార్యకర్తలతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన అభ్యర్థిని తానేనంటూ ప్రచారం చేసుకోవడంపై మండిపడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో జరిగే సమీక్ష సమావేశంలో కామినేని వైఖరిపై ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు టీడీపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు.. కామినేని వ్యవహారంతో వచ్చే ఎన్నికల్లో తనకు లాభిస్తాయని ఆశిస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే దూల నాగేశ్వరరావు. మొత్తానికి కామినేని మైండ్‌గేమ్‌తో టీడీపీ నాయకులకు దిమ్మదిరిగిపోతోందని అంటున్నారు.