Marakatha Ganapathi : 90 కిలోల ‘పంచముఖ మరకత గణపతి’ విగ్రహం..! ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షం..!!

కోట్ల రూపాయలు విలువ చేసే 90 కిలోల ‘పంచముఖ మరకత గణపతి’ విగ్రహం..ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షమైంది..!!

Marakatha Ganapathi : 90 కిలోల ‘పంచముఖ మరకత గణపతి’ విగ్రహం..! ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షం..!!

90 Kg Marakatha Ganapathi In Ap Prakasham District

90 Kg Marakatha Ganapathi In AP prakasham district : మరకతం..! ఇది మహా విలువైన సంపద. కొన్ని నెలల క్రితం తమిళనాడులో లభ్యమైంది. ఇప్పుడు ఏపీలో పంచముఖ అవతారంలో ప్రత్యక్షమైంది. కాసులు కురిపించే ఆ విగ్రహం చూడ్డానికి చిన్నగానే ఉన్నా, ఓ మనిషి ఎత్తలేని బరువూ ఉంటుంది. ఇప్పుడు ఆ నోట, ఈ నోటపడి ఖాకీల చేతికి చిక్కింది. చివరకు రాజకీయ ఒత్తిడితో రాత్రికి రాత్రే సీన్ అంతా మారింది. ఇంతకీ ఆ మరకత విగ్రహ మర్మం ఏంటీ..? ఇందులో ఇన్వాలైనా నాయకులెవరు..?

అచ్చంగా ఇటువంటిదే..కొన్ని నెలల క్రితం తమిళనాడులోని ఆయన తండ్రి శివయ్య విగ్రహం కూడా ఇలానే బయటపడింది. పచ్చని వర్ణంలో ఉండే ఈ విగ్రహాలను మరకతముగా పిలుస్తారు. ఈ విలువైన రత్నం ఖరీదు… కోట్లల్లో అంటే నమ్మక తప్పదు. ఈ విగ్రహాలు లభ్యం కావడమే అరుదు… అందితే మాత్రం పోటీపడి మరీ కాసులు కుమ్మరిస్తారట.ఈ గణపయ్య విగ్రహం చూడ్డానికి… ఎదో గాజు పెంకుకు రంగేసినట్లుందని అనుకుంటున్నారుకదా…అయితే మీరు పొరబడినట్లే. స్వచ్చమైన ఆకుప్కచ్చ రంగుతో ఉన్న ఈ విగ్రహం విలువ అక్షరాల 25 కోట్లకు పైమాటేనంట. చూడ్డానికి రెండడుగులు మాత్రమే ఉన్న ఆ విగ్రహం గురించి తెలుస్తే మీ కళ్లుబైర్లు కమ్ముతాయి. వేద భూమిగా పిలిచే భారత దేశంలో ఈ ఏడాదిలో రెండు లభ్యమయ్యాయి. ఇప్పుడీ పంచముఖ గణపయ్య ప్రకాశం జిల్లాలో ప్రత్యక్షమయ్యాడు.

యర్రగొండపాలెం….ఇది నల్లమల్ల అటవీప్రాంతానికి సమీపంలో ఉంటుంది. చుట్టు పచ్చని కొండ ప్రాంతాలు కావడంతో… పురాతన ఆలయాలు కూడా ఎక్కువగానే దర్శనమిస్తాయి. రాయలు ఏలిన ఈ పుణ్య భూమి… వజ్రసంపదకు పెట్టింది పేరు. అలాంటి యర్రగొండపాలెంలో ఇప్పుడు మరకత పంచగణపతి విగ్రహం లభ్యమైంది. కేవలం… రెండు అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పు కల్గిన ఈ వినాయకుడి బరువు.. 90 కిలోలంటే షాకవ్వాల్సిందే. చూడ్డానికి చిన్నగానే కన్పిస్తుంది కానీ…ఓ మనిషి మోయలేనంత బరువుందంటే అందులో ఏదో మహిమ దాగిఉంటుందని అందరిలో ఓ ప్రశ్న మెదులుతోంది.

కాసులు కుమ్మరించే ఈ విగ్రహం సుమారుగా 500 ఏళ్ల కాలం నాటిదని నిపుణులు అంచనా వేస్తున్నా…అంతకు మించి ఉంటుందని స్థానికులు అంటున్నారు. పురాతన ఆలయాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే బ్యాచ్ కి… పంచముఖ గణపతి విగ్రహం లభ్యమైందని స్థానికులు అంటున్నారు.అయితే ఇటువంటి ప్రాచీన కళాకాండాలను… అమ్మడం, కొనుగోలు చేయడంలో స్థానిక పంచాయితీ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డికి మంచి ఆసక్తి కనబరుస్తుంటాడని అక్కడి ప్రజలుచెప్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ లో సాప్ట్ వేర్ ఉద్యోగం చేసే ఇంద్రసేనా రెడ్డికి రాజశేఖర్ రెడ్డి వరుసకు బావ అవుతాడు. మరకత విగ్రహం విషయాన్ని అతనికి చెప్పి అమ్మాకానికి పెట్టాలని కోరాడు.

రెండున్నర అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పుతో 90 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని కొందరు రూ.25 కోట్లకు విక్రయించేందుకు బేరసారాలు సాగిస్తున్నట్టు ఒంగోలు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఈ నెల 10న వారే కొంటామంటూ నమ్మబలికిన పోలీసులు అక్కడికి మప్టీలో వెళ్లారు. యర్రగొండపాలెం, వినుకొండ రోడ్డులోని వెంకటేశ్వరరెడ్డికి చెందిన షెడ్డులో విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే… ఈ ఆకుపచ్చ విగ్రహం విక్రయంలో ఏపీలో అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి నుంచి ఒత్తిడిలు ఎదురయ్యాయట. పోలీసులతో బేరసారాలు ఆడినవారిని వదిలిపెట్టాలని ఫోన్లు రావడంతో…తమ పరిధి కాదని వారిని వైపాలెం పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే 41 నోటీసులు జారీ చేసి రాత్రికి రాత్రే నిందితులను స్టేషన్ బెయిల్ పై పంపించేశారు. ఇక్కడ ఈ కేసును పోలీసులు పక్కదోవ పట్టించేందుకు పయత్నాలు చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా ఎవరూ నోరు మెదపకపోవడం మరో విశేషం.ఇప్పుడు ఈ విషయం రాజకీయ రంగు పులుముకుంది.

ఇక్కడ చూస్తున్న గణపతికి వెనుక భాగంలో సూర్య భగవానుడి బొమ్మలు వేయడం వెనుకాల ఏదో మహత్యం ఉందని చెప్తున్నారు.మరకతాన్ని ఆయుర్వేదంలో సకల రోగ నివారిణిగా వాడుతారని ప్రచారంలో కూడా ఉంది. ఇంట్లో, చేయి ఉంగరాలలో మరకత రాయిని పెట్టుకుంటే… అదృష్టం కలిసి రావడంతోపాటు లక్ష్మిదేవత సౌభాగ్యాలు ఇస్తుందని భారతీయుల్లో సెంటి మెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ను ఆసరాగా తీసుకుని కొంతమంది కేటుగాళ్లు ఇలాంటి విలువైన సంపదలను పక్కదారులు పట్టిస్తున్నారు.