Pawan Kalyan: జగన్ పాలనలో జరిగింది.. జరిగేది ఇదే..! జనసేన ఆవిర్భావ సభలో విరుచుకుపడిన పవన్

ఏపీ ప్రభుత్వ పాలన తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్ విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావ సభలో.. తూటాల్లాంటి మాటలతో మంత్రులు, వైసీపీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు.

Pawan Kalyan: జగన్ పాలనలో జరిగింది.. జరిగేది ఇదే..! జనసేన ఆవిర్భావ సభలో విరుచుకుపడిన పవన్

Pawan

Pawan Kalyan: జగన్ ప్రభుత్వంపై.. జనసేనాని పవన్ తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. ఆ పార్టీలో ఉన్న చాలా మంది నేతలంటే తనకు ఇష్టమని అంటూనే.. వైసీపీ కార్యకర్తలు అంటే గౌరవం ఉందని చెబుతూనే.. వారి విధానాలపై విమర్శల వర్షం కురిపించారు. ఇమ్మటంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో.. వేలాదిగా హాజరైన జన సైనికులు, వీర మహిళల మధ్య.. తన సందేశాన్ని పవన్ వినిపించారు.

తనకు రాజకీయాల్లో స్ఫూర్తి ఇచ్చిన తెలుగు రాష్ట్రాల నాయకులకు ఆయన ముందుగా నమస్కారాలు చెబుతూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పాత్రికేయ రంగానికి.. భీమ్లానాయక్ లైన పోలీసులకు నమస్కారాలు చెప్పారు. వైసీపీ నేతలకూ నమస్కారం చెప్పాలని తన సంస్కారం చెబుతోందంటూ.. ఆ పార్టీ కేడర్ కూ నమస్తే చెప్పారు. జనసైనికులు, వీర మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. వారే లేకుంటే తాను లేనని.. పార్టీ కూడా లేదని ఉద్వేగ భరితంగా ప్రసంగించారు.

వైసీపీ పాలన విషయానికి వస్తే.. కూల్చివేతల వంటి అశుభంతో పాలన ప్రారంభించిందని చెప్పారు. ఇసుక పాలసీ విధానంతో 32 మంది కార్మికుల బలవన్మరణానికి కారణమైందని ఆరోపించారు. భారతదేశం నా మాతృభూమి.. అని ప్రజలంతా ప్రతిజ్ఞ చేస్తే.. వైసీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం చేసే ప్రతిజ్ఞ వేరంటూ.. వ్యంగ్యంగా ప్రసంగాన్ని కొనసాగించారు. ఒక్క చాన్స్ ఇచ్చినందుకు 25 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వెనక్కు తీసుకువెళ్లారని.. మరో చాన్స్ ఇస్తే ఇంకా దారుణంగా పాలన ఉంటుందని అన్నారు.

అమరావతి విషయంలో.. వైసీపీ తీరును కూడా పవన్ తప్పుబట్టారు. ప్రతిపక్షంలో ఉండగా.. అమరావతికి మద్దతిచ్చిన వైసీపీ నేతలు.. 3 రాజధానుల గురించి ఆ నాడు ఎందుకు మాట్లాడలేదని పవన్ ప్రశ్నించారు. 3 రాజధానుల నిర్మాణం కట్టాలంటే ఆర్థికంగా ప్రజలకు భారమని.. అదంతా ఎవరు భరిస్తారని అన్నారు. “అమరావతి రైతులకు చెబుతున్నా.. రాజధాని ఎక్కడికీ పోదు. ఇక్కడే ఉంటుంది. అమరావతే రాష్ట్రానికి రాజధాని. ఇతర ప్రాంతాలను మేం విస్మరించం. చట్ట సభల్లో ప్రభుత్వాలు ఇచ్చిన హామీని పాలకులు నిలబెట్టుకోవాల్సిందే.” అని పవన్ తేల్చి చెప్పారు.

హై కోర్టు ఓ పార్టీ బ్రాంచ్ ఆఫీస్ గా మారిందని వైసీపీ నేతలు మాట్లాడ్డం ఏంటని పవన్ ప్రశ్నించారు. న్యాయవ్యవస్థను శాసించేంతగా వీళ్లు ప్రవర్తిస్తున్నారంటూ.. వైసీపీ నేతల తీరును తప్పుబట్టారు. కొందరు మంత్రులకు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు ఉండే జ్ఞానం లేదని విమర్శించారు. అమరావతి రైతులపై ముందుగా ఈ ప్రభుత్వం పొట్ట కొట్టిందని.. రైతులపై దాడి చేసిందని.. పోలీసులను వాడుకుని వారిని జనం దృష్టిలో చెడ్డవారిని చేశారని ఆరోపించారు. పోలీసులకు కనీసం డీఏ ఇవ్వడం లేదని.. జీతాలు తగ్గించేశారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే పోలీసులకు వారాంతపు సెలవు ఇస్తానని చెప్పిన జగన్.. మాట తప్పారని అన్నారు. పోలీసులపై వైసీపీ నేతలు దాడులు కూడా చేశారని.. ఓ పోలీస్ బిడ్డగా ఆ బాధ తనకు తెలుసని పవన్ అన్నారు.

ఓవరాల్ గా వైసీపీ పాలనకు సంబంధించిన మరిన్ని అంశాలపై మాట్లాడిన పవన్.. తీవ్ర స్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రావడమే ధ్యేయంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజా బలాన్ని, ఓటు బ్యాంకును పెంచుకుంటున్నామని.. ప్రభుత్వ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. తాను వేసే అడుగుల్లో.. జన సైనికులు, వీర మహిళలు నడవాలని.. ప్రజలు నడిచేలా చేయాలని పిలుపునిచ్చారు.. జనసేన అధ్యక్షుడు పవన్.

Read More:

Nagababu : జగన్ మళ్లీ సీఎం అయితే ఏపీ ప్రజలు కాందిశీకుల్లా పక్క రాష్ట్రాలకు వెళ్లాలి : నాగబాబు