Police lathi-charge: అనంతపురంలో విద్యార్థులపై విరిగిన లాఠీ.. విద్యార్థినికి పగిలిన తల

అనంతపురంలో విద్యార్థులపై పోలీస్‌ లాఠీ విరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేశారు ఖాకీలు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

Police lathi-charge: అనంతపురంలో విద్యార్థులపై విరిగిన లాఠీ.. విద్యార్థినికి పగిలిన తల

Police (1)

Police lathi-charge: అనంతపురంలో విద్యార్థులపై పోలీస్‌ లాఠీ విరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్‌ చేశారు ఖాకీలు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొంతమంది తలలు పగిలాయి. దీంతో అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది.

అనంతపురంలో ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల, పాఠశాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు రోడ్డెక్కారు. ఎయిడెడ్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చదువులను వ్యాపారం చేస్తోందని ధర్నాకు దిగారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. విద్యార్థులపై విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

ఎయిడెడ్‌ కాలేజీలు, స్కూళ్ల విలీనం వ్యతిరేకిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ దగ్గర విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎప్‌ విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. ఈ నిరసనలో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఎస్‌ఎస్‌బీఎన్‌ కాలేజీ, స్కూల్‌ విలీనాన్ని వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు.

అయితే కాలేజీ యాజమాన్యం ఇప్పటికే విలీనానికి అంగీకరించింది. ఇందుకు సంబంధించిన పత్రాన్ని సైతం విద్యాశాఖ పంపించింది. ఈ వ్యవహారంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. విలీనాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. కాలేజీ, స్కూల్‌ను ప్రైవేట్‌ పరం చేస్తే ఫీజులను కట్టలేమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాఠీఛార్జ్‌ అనంతరం పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు పోలీసులు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అత్యుత్సహం ప్రదర్శించి లాఠీఛార్జ్‌కి దిగారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.