తెలుగు తమ్ముళ్ల ఆవేదన : బాబు మారాలంటారు.. మరి మీరు మారరా?

  • Published By: sreehari ,Published On : December 23, 2019 / 12:15 PM IST
తెలుగు తమ్ముళ్ల ఆవేదన : బాబు మారాలంటారు.. మరి మీరు మారరా?

తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబునే తప్పు పడుతున్నారు. పార్టీ పరిస్థితికి మీరే కారణమంటూ చంద్రబాబు వైపు వేలెత్తి చూపిస్తున్నారు. మా అధినేత మారాలి, మారాలి అంటూ ఒకటే నస పెడుతున్నారట. ఇంతకీ ఏం మారాలంటే మాత్రం… మారాలి అంతే అని చెబుతున్నారట.

ఇలాంటి వారిపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారని అంటున్నారు. నిన్నటి దాకా అధికారం, దర్పం, ఎక్కడికెళ్లినా వంగి వంగీ దండాలు.. అలా అనుభవించిన వారంతా నేడు కనిపించడం లేదు. పార్టీపై విమర్శలను తిప్పికొట్టేందుకు కూడా ముందుకు రావడం లేదని వాపోతున్నారు టీడీపీ కార్యకర్తలు.

బాబు చూసుకుంటారులే:
ఏమున్నా అన్నీ చంద్రబాబు చూసుకుంటారని పదవులు అనుభవించి నాయకులంతా ఇప్పనుడు అంటున్నారట. ఒక్కడుగా అందరితో జట్టు కట్టి, ఒక్కడిగానే పోరాటం చేసి, పాదయాత్ర చేసి పార్టీకి పునరుజ్జీవం పోసి అధికారంలోకి తీసుకొస్తే ఐదేళ్ళు అన్నీ అనుభవించారని, అలాంటి వారంతా ఇప్పుడు ఎక్కడున్నారని తెలుగు తమ్ముళ్లు రుస రుసలాడుతున్నారు.

పదవులలో ఉన్నప్పుడు మాత్రం పెత్తనానికి ముందుంటారు. ప్రతిపక్షంలో మాత్రం విశ్రాంతిని కోరుకుంటారని అంటున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలౌతోంది. అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి. పార్టీని వైసీపీ నేతలు ఇష్టానుసారంగా తిడుతున్నా చాలా మంది నేతలు స్పందించడం లేదని బాధపడుతున్నారట.

గంటా మాట్లాడలేరా? :
అక్రమ కేసులు పెడుతున్నారని, భయపడి ఆ పార్టీలోకి వెళ్లిపోతున్నారంటూ టీడీపీ కార్యకర్తలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవన్నీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, కీలక తెలుగుదేశం నేతలకు కనిపించడం లేదా? అని నిలదీస్తున్నారట. అగ్రిగోల్డ్ వ్యవహారం తంతు అంతా పూర్తి చేసి, పంచే సమయానికి కొత్తగా అధికారంలోకి వచ్చిన వైసీపీ క్రెడిట్ కొట్టేస్తుంటే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పుల్లారావుకు కనిపించడం లేదా అని తమ్ముళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

విశాఖ జిల్లాను నిన్నటి దాకా ఏలి, పరిశ్రమలు తరలిపోయే పరిస్థితి ఎదురౌతుంటే గంటా శ్రీనివాసరావు మాట్లాడలేరా? అంటున్నారు. ఇప్పుడు పోలవరం రివర్స్ టెండరింగ్‌తో పనులు ఆగిపోతే అడగాల్సిన అవసరం, బాధ్యత అంతా చంద్రబాబుదే అనేలా మాట్లాడడం కార్యకర్తలకు నచ్చడం లేదంటున్నారు.

అధికార పార్టీని ఎండగట్టలేరా?
ఓ వైపు కేంద్రం ఎక్కడా పోలవరంలో అవినీతి జరగలేదంటుంటే ప్రజలకు చెప్పలేరా? అధికార పార్టీని ఎండగట్టలేరా? మరో మాజీ మంత్రి సిద్దారాఘవరావు, ఇంకా ఇతర మాజీ మంత్రులు, నేతలెవ్వరూ స్పందించలేరా? లేక తీరికలేదా? అంతా చంద్రబాబే చూసుకుంటారనా? చంద్రబాబు మారాలంటారు.. మరి మీరు మారరా? అంటూ తెలుగు తమ్ముళ్లు ఆవేదనంతా వెళ్లగక్కుతున్నారట. టీడీపీకి చెందిన కీలక నేతలంతా తమ కృషి కన్నా కూడా చంద్రబాబు పేరుతో గెలవడం అలవాటు పడ్డారని, అందుకే పనిచేయటం మానేశారని జనాలు కూడా అనుకుంటున్నారు.