Thirumala : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల కోసం భారీగా తరలివచ్చిన భక్తులు
సుదీర్ఘ విరామం తర్వాత టీటీడీ తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట నుంచే సర్వదర్శనం టికెట్ల భక్తులు కోసం క్యూ లైన్‌లలో వేచి ఉన్నారు.

Tirumala
Srivari Sarva Darshan tokens : సుదీర్ఘ విరామం తర్వాత టీటీడీ తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో..తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెట్లు జారీ చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభమైంది. రోజుకు రెండు వేల చొప్పున టోకెన్లను ఇస్తున్నారు. అది కూడా ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో సర్వదర్శనం కోసం చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తిరుపతికి చేరుకున్నారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచే సర్వదర్శనం టికెట్ల కోసం క్యూ లైన్‌లలో వేచి ఉన్నారు. టికెట్లు దొరికిన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా దృష్ట్యా ఏప్రిల్ 11 నుంచి ఈ టోకెన్ల జారీని నిలిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను పొందిన భక్తులకు టోకెన్లు ఇవ్వడం లేదు. ఒకసారి దర్శనం అనంతరం నెల వ్యవధి ఉంటేనే టోకెన్ల ఇస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్‌తో ఏప్రిల్ మొదటివారం నుంచి ఆంక్షలు విధించారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో సర్వ దర్శనానికి అనుమతి లభించింది. దాదాపు ఐదు నెలలకు భక్తులక శ్రీవారి సర్వదర్శన భాగ్యం కలిగింది. చాలా రోజుల తర్వాత శ్రీవారి సర్వదర్శనానికి అవకాశం రావడంతో టోకెన్ల కోసం భక్తులు తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్‌లోని కౌంటర్లకు భారీగా తరలివచ్చారు.
టీటీడీ గతంలో రోజుకు 8 వేల సర్వదర్శన టోకెన్లను జారీ చేసేది. ఇప్పుడు రెండు వేలకే పరిమితం చేసింది. మరికొన్ని రోజుల తర్వాత అందరు భక్తులకూ సర్వదర్శనం కల్పించే అవకాశాలున్నాయి. 6 గంటలకు ప్రయోగాత్మకంగా టోకెన్ల జారీ చేపట్టిన టీటీడీ అధికారులు..కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తగ్గాక ఇంతవరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జారీచేస్తూ వస్తోంది.
మొదటగా ఐదు వేల మందికే అనుమతి ఇచ్చినా.. తర్వాత కాలంలో ఎనిమిది వేల మందికి పెంచారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం, వర్చువల్ ఆర్జిత సేవల ద్వారా 20 వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. సర్వ దర్శనాలకు అనుమతి ఇస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇచ్చిన హామీ మేరకు.. టీటీడీ 2 వేల మందికి అనుమతి ఇచ్చినా..ఇతర జిల్లాల నుంచి వారికి కూడా సర్వదర్శనం టికెట్లు ఇవ్వవచ్చని తెలుస్తోంది.