Tirumala Bramostavam 2022 : శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి .. ఒక్కో వాహనంపై ఒక్కో రూపం.. శ్రీవారి వాహనాల విశేషాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో సప్తగిరులు ఆనంద పారవస్యంతో మునిగితేలుతాయి. శ్రీవారి వాహన సేవలతో ఏడుకొండలు తరిస్తాయి. అంతటి విశిష్టత వాటికుంది. మరి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలకు ఎందుకంత ప్రత్యేకత వచ్చింది..? వాటి విశేషమేమిటి..?

Tirumala Bramostavam 2022 : శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి .. ఒక్కో వాహనంపై ఒక్కో రూపం.. శ్రీవారి వాహనాల విశేషాలు

Tirumala Bramostavam  2022 : తిరుమల కొండ నిత్యకళ్యాణం పచ్చతోరణంతో గోవింద నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది. అటువంటిది బ్రహ్మోత్సవాల సమయంలో సప్తగిరులు ఆనంద పారవస్యంతో మునిగితేలుతాయి. శ్రీవారి వాహన సేవలతో ఏడుకొండలు తరిస్తాయి. అంతటి విశిష్టత వాటికుంది. మరి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలకు ఎందుకంత ప్రత్యేకత వచ్చింది..? వాటి విశేషమేమిటి..?

బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నుంచి.. ఆ ఉత్సవాలు ముగిశాయని చెప్పడానికి నిర్వహించే ధ్వజ అవరోహణం వరకూ.. ప్రతీ ఘట్టం భక్తులకు నేత్ర పర్వమే. అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. స్వామివారి సేనాధిపతి అయిన శ్రీవిష్వక్సేనుడు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంతమండపానికి ఊరేగింపుగా తీసుకు వెళ్తారు. అక్కడ పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ మట్టిలో నవ ధాన్యాలను నాటుతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పరణం అయ్యింది.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలన్నీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాయిద్యాల నడుమ అర్చకస్వాములు స్వర్ణంతో కూడిన ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు.

తొలిరోజు స్వామి వారు పెద్ద శేషవాహనం తిరుమాడ వీధులలో ఊరేగుతారు. ఏడు పడగల ఆదిశేషువు నీడలో కూర్చుని ఉభయ దేవేరులతో కదిలి వచ్చేకలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూడడానికి రెండు కళ్లూ చాలవు. పెద శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపరమపదం సిద్ధిస్తాయి.

రెండోరోజున శ్రీమలయప్ప స్వామివారు చిన్నశేషవాహనంపై విహరిస్తారు. ఐదు పడగలతో ఈ వాహనం ఉంటుంది. పురాణాల ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచ శేషభూతం. శేషవాహనం ఈ శేషభావాన్ని సూచిస్తుంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండోరోజు శ్రీమలయప్పస్వామి వీణాపాణియై హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో కూడా దర్శనమిస్తారు. బ్రహ్మవాహనమైన హంస పరమహంసకు ప్రతీక. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని చెబుతారు.

మూడోరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సింహవాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. యోగశాస్త్రంలో సింహం బలానికి, వేగానికి ఆదర్శంగా భావిస్తారు. అదేరోజు రాత్రి స్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ముత్యం స్వచ్ఛతకు సంకేతం. మనిషి ఆత్మ ఎన్నో జన్మల తర్వాత దుర్లభమైన మానవజన్మను సంతరించుకుంటుంది. శరీరాన్ని ఆధ్యాత్మిక సంపదతో శుద్ధి చేసుకుంటే బుద్ధి ముత్యంలాగా మారి, జనన, మరణచక్రం నుండి విడుదలై మోక్షాన్ని పొందుతుంది. అందుకే ముత్యపుపందిరి వాహనానికి ఇంతటి విశిష్టత.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు శ్రీమలయప్ప స్వామి వారు కల్పవృక్షవాహనంపై ఆలయంలోని నాలుగు మాడవీధుల్లో విహరిస్తారు. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. అదేరోజు రాత్రి సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు ఐదోరోజున మోహినీ రూపంలో దర్శనమిస్తారు. ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని చాటి చెబుతారు. అదేరోజు రాత్రి గరుడ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ తన దివ్యమంగళ రూపంలో భక్తులను కరుణిస్తారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఉదయం శేషాచలాధీశుని రాముని అవతారంలో హనుమతుని వాహనంపై విహరిస్తాడు. విష్ణు భక్తులలో హనుమంతుడు అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. హనుమంతున్ని స్మరిస్తే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, ఆరోగ్యం సిద్ధిస్తాయి. అలాంటి హనుమంత వాహనంపై విహరించిన స్వామి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఆరో రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది. అదేరోజు రాత్రి ఏడుకొండల స్వామి గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగింపు జరుగుతుంది.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అదేరోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారు. చంద్రుడు శివునిని శిరోభూషణమైతే ఇక్కడ శ్రీవారికి వాహనంగా ఉండటం విశేషం.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు ఎనిమిదో రోజు ఉదయం అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. స్వామి అశ్వవాహనంపై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని బోధిస్తారు. కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చెప్పడమే ఈ వాహన ఉద్దేశం.

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదోరోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. అదేరోజు రాత్రి స్వర్ణ తిరుచ్చి ఉత్సవం తర్వాత ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఈ ఘట్టంతో తొమ్మిదిరోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.