Rain Alert : బంగాళాఖాతంలో ద్రోణి.. వచ్చే మూడ్రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ
Rain Alert ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సోమవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని
Rain Alert
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్ ప్రభావం తగ్గిన తరువాత వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కొంతకాలంగా ఎడతెరిపిలేని వర్షాలతో ఇబ్బందులు పడిన రెండు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే, మొన్నటి వర్షాలతో ఇబ్బందులు పడిన తెలుగు ప్రజలు ఇప్పుడు చలికి సిద్ధం కావాలని వాతావరణ అధికారులు చెబుతున్నారు.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి బంగాళాఖాతం నుంచి కేరళ వరకు శ్రీలంక – తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. అదేవిధంగా దిగువన ట్రోపోస్థాయిలో ఉత్తర -ఈశాన్య గాలులు వీస్తుండటంతో వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో వచ్చే మూడ్రోజులు పాలు ప్రాంతాల్లో వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సోమవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తాలో రెండు రోజులు జల్లులు, మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉండగా.. దక్షిణ కోస్తా జిల్లాల్లో మూడ్రోజులు మధ్యాహ్నం నుంచి రాత్రివేళ వరకు కొన్నిచోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. దీంతో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. నవంబర్ 10వ తేదీ తరువాత చలి తీవ్రత మరింత పెరుగుతుందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా.. మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడే అవకాశం ఉంది.
