Gangamma Jatara : అమ్మవారిని బూతులు తిట్టే ఆచారం..మగాళ్లు చీరలు కట్టుకుని మొక్కులు చెల్లించుకునే 900 ఏళ్లనాటి సంప్రదాయం

Gangamma Jatara : అమ్మవారిని బూతులు తిట్టే ఆచారం..మగాళ్లు చీరలు కట్టుకుని మొక్కులు చెల్లించుకునే 900 ఏళ్లనాటి సంప్రదాయం

Gangamma Jatara In Tirupati (2)

Gangamma Jatara in tirupati : జాతర వస్తే ఎవరైనా ఏం చేస్తారు ? అమ్మవార్లకు అత్యంత భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు పెట్టి, మొక్కులు చెల్లించుకుని, పిండివంటలు వండుకుని… పిల్లాపాపలు, బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు. కానీ జాతరలో అమ్మవారినే బూతులు తిట్టే ఆచారం గురించి మీరెప్పుడైనా విన్నారా ? మగాళ్లు చీరలు కట్టుకుని వచ్చి అమ్మోరికి మొక్కులు చెల్లించుకునే వింత ఆచారం గురించి మీకు తెలుసా ? అలాంటి వింత జాతర, విచిత్ర వేషధారణల గురించి తెలుసుకుందాం…!

రాయలసీమలోనే అతిపెద్ద జన జాతర..తిరుపతి గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలు..ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా.. శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు. భిన్న సంప్రదాయాలకు, వైవిధ్యాలకు అసలు సిసలు కాణాచి తిరుపతి గంగ జాతర. ఏడాదికోసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది. వారం రోజులపాటు ఈ జాతర కన్నులపండువగా సాగుతుంది. కరోనా కారణంగా రెండేళ్లు జాతరకు దూరమైన భక్తులు… ఈసారి ఎంతో ఉత్సాహంగా జాతరలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పాలెగాడి కోసం గంగమ్మ కట్టిన వేషాలే భక్తులు జాతర సమయంలో ధరిస్తారు. గంగమ్మజాతరలో భాగంగా వారం రోజులపాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు ఆయా రోజుల్లో ఆరువేషాలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు. బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగుతాయి.

జాతర ప్రారంభమయ్యే మొదటిరోజున పుట్టింటి సారెను అవిలాల గ్రామపెద్దల నుంచి ఆలయ నిర్వాహకులు వూరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తారు. ఆ విధంగా సంప్రదాయ బద్ధంగా పుట్టింటి సారెను అందుకున్న మరుక్షణం నగర పొలిమేర్లలో చాటింపు వేస్తారు. ఆ తర్వాత నగరం నుంచి స్థానికులైనవారు పొలిమేరలు దాటకూడదని విశ్వాసం. జాతర జరిగే రోజులన్నింటిలోనూ వీధులలో అంబలి వితరణ, పెరుగన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు. ప్రధానంగా జాతరలో బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, మాతంగి వేషం, సున్నపు కుండల వేషం… చివరగా దొర వేషం ధరించి భక్తులు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. అప్పుడే పుట్టిన పురిటి బిడ్డల నుంచి పండు ముసలి వరకు… చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు. వీటితోపాటు ఆడవేషం, దేవుళ్ళ వేషం, పౌరాణిక ప్రముఖుల వేషాలు ధరించి గంగమ్మ ఆశీర్వాదం పొందుతారు. అందుకే ఇది వేషాల జాతరగా ప్రసిద్ధికి ఎక్కింది.

ఈ జాతరలో ఐదవరోజు మాతంగి వేషం. దీనికున్న ప్రత్యేకతే వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే జంబలకడి పంబ సినిమాను తలపించేలా వేషధారణ జాతరలోనే హైలెట్. పురుషులు అచ్చం ఆడపడుచుల్లా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు. శరీరమంతా గంధం పూసుకుని చీరలను ధరిస్తారు. మేకప్ వేసేందుకు బ్యుటీషియన్లు సైతం వస్తుంటారు. ఇలా చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు నమ్ముతారు. అందుకే సిగ్గు పడకుండా చీరలు కట్టుకుని సింగారించుకుని జాతరలో సందడి చేస్తుంటారు.

ఇక గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడైనా అమ్మవారి జాతరంటే ఎంతో భక్తశ్రద్ధలతో.. నిష్టగా జరుపుతారు. గంగమ్మ జాతరను కూడా భక్తులు అంతే భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. కాకపోతే అమ్మవారినే తిట్టడం ఈ జాతర స్పెషాలిటీ. భక్తులంతా బూతుపురాణం అందుకుంటారు. నోటికి వచ్చిన తిడుతుంటారు. అది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ గంగమ్మ తల్లిపై..వినడానికే విచిత్రంగా ఉన్నా ఇది పచ్చి నిజం. గంగమ్మను ఎంత తిడితే అంత శాంతిస్తుందట. అందుకే నోటికి వచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటారు.

గంగమ్మ జాతరకు స్థానికులే కాదు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వాసులు సైతం తరలి వస్తుంటారు. తిరుపతిని మొత్తం ఏడుగురు గ్రామదేవతలు కాపాడుతున్నారని భక్తుల నమ్మకం. అందులో ఒకరే గంగమ్మ తల్లి. శ్రీ వేంకటేశ్వస్వామికి స్వయానా చెల్లెలు. అందుకే ఈ గంగమ్మ జాతర అంటే రాయలసీమలో ఓ రేంజ్‌ హడావుడి కనిపిస్తుంది.