Danam Nagender: దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధమయ్యారా? అధిష్టానం నుంచి వచ్చిన హామీ ఏంటి?
ఇప్పటికీ ఈ వర్గాల నుంచి క్యాబినెట్‌లో చోటు లేదు. దీంతో అటు దానం, ఇటు నవీన్ యాదవ్ క్యాబినెట్ బెర్త్ కోసం ఆశపడుతున్నారట.
Danam Nagender: ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్‌లో సీరియస్ అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. తర్వాత కాంగ్రెస్ గూటికి చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో హస్తం సింబల్ మీద ఎంపీగా కంటెస్ట్ చేశారు. దీంతో ఆయన పార్టీ ఫిరాయించినట్లు ఔట్ రైట్‌గా దొరికిపోయినట్లు అయిపోయింది. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా దానం నాగేందర్ రాజీనామా..ఖైరతాబాద్‌కు బైపోల్ అంటూ ప్రచారం నడుస్తోంది. లేటెస్ట్‌గా దానంకు మరోసారి స్పీకర్ నోటీసులు ఇవ్వడం..ఈ నెల 23న హాజరు కావాలని ఆదేశించడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
స్పీకర్ దగ్గర విచారణకు దానం అటెండ్ అవుతారా అంతకంటే ముందే రిజైన్ చేస్తారన్న అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. సరిగ్గా ఇదే టైమ్‌లో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో దానం భేటీ అవడం..అసెంబ్లీ సెక్రటరీని కూడా కలవడం హాట్ టాపిక్ అవుతోంది. రాజీనామాకు దానం సిద్ధమయ్యారని..కాంగ్రెస్ అధిష్టానం నుంచి అనుమతి రాగానే..స్పీకర్‌కు రిజైన్ లెటర్ పంపిస్తారని అంటున్నారు. ఇక కడియం శ్రీహరి కూడా మిగతా 8మంది ఎమ్మెల్యేలలాగా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది.
దానం రిజైన్ చేస్తే..తెలంగాణలో..పైగా గ్రేటర్‌లో మరో ఉప ఎన్నిక తప్పేలా లేదు. ఢిల్లీలో పార్టీ ముఖ్య నాయకత్వంతో దానం చర్చలు జరిపి వచ్చారు. రాజీనామాకు సిద్ధమేనంటూ కొన్ని కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని..ఇక.. ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని, గెలిచాక మంత్రివర్గంలో చోటు కల్పించాలని దానం ప్రతిపాదన చేసినట్లు టాక్. అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాగానే దానం రాజీనామా చేయడం ఖాయమని అంటున్నారు.
క్యాబినెట్ రేసులో నవీన్ యాదవ్..?
గ్రేటర్ కోటా, మైనార్టీ ఈక్వేషన్‌లో ఆల్రెడీ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. లేటెస్ట్‌గా జూబ్లీహిల్స్ బైపోల్‌లో గెలిచిన నవీన్ యాదవ్ పేరు కూడా ఇప్పుడు క్యాబినెట్ రేసులో వినిపిస్తోంది. ఇప్పుడు దానం కూడా గ్రేటర్ కోటాలో అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్నారట. దానం మున్నూరు కాపు. నవీన్ యాదవ్..యాదవ సామాజికవర్గం. ఈ రెండు సామాజికవర్గాలు తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి. ఇప్పటికీ ఈ వర్గాల నుంచి క్యాబినెట్‌లో చోటు లేదు. దీంతో అటు దానం, ఇటు నవీన్ యాదవ్ క్యాబినెట్ బెర్త్ కోసం ఆశపడుతున్నారట. అయితే సీనియారిటీ, గతంలో కాంగ్రెస్ పెద్దలతో ఉన్న పరిచయాలు, రిజైన్ చేసి ఉప ఎన్నికను ఫేస్ చేయబోతుండటం వంటి సవాళ్ల దృష్ట్యా తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట దానం.
కడియం శ్రీహరి విషయంలో సమాలోచనలు..
మరోవైపు కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన కడియం శ్రీహరి..లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన తన కూతరు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సమయంలోనే అనర్హత పిటిషన్‌పై వివరణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కోరారు కడియం. ఆయనతో రాజీనామా విషయంలో కొంతకాలం వేచి చూడటమే బెటర్‌ని భావిస్తున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు కాంగ్రెస్‌కు అంత అనుకూలంగా లేవని..గ్రేటర్‌లో అయితే జూబ్లీహిల్స్ ఊపుతో ఇంకో సీటు గెలుచుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారట. రాజీనామాకు మంత్రి పదవికి దానం లింకు పెట్టడం ఆసక్తికరంగా మారింది. మరి కాంగ్రెస్ అధిష్టానం క్యాబినెట్ బెర్త్‌పై హామీ ఇస్తుందో లేదో చూడాలి.
