ఉక్కు ఉద్యమం మరింత తీవ్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మోగిన సమ్మె సైరన్

ఉక్కు ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది.

ఉక్కు ఉద్యమం మరింత తీవ్రం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మోగిన సమ్మె సైరన్

Vizag Steel Plant Workers to go on Strike: విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీకి కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేంత వరకు సమ్మె చేస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి.

విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలు కూడా కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులకు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. అయినప్పటికీ కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. వైజాగ్ ప్లాంట్ నుంచి 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్టు పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేసింది. దీంతో, ఉక్కు ఉద్యోగులు తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమ్మె నోటీసు ఇచ్చింది.

ప్లాంటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సీతమ్మధార భూముల విక్రయ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, పోస్కో కంపెనీతో జరిగిన ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసును విశాఖ స్టీల్ సీఎండీకి ఇచ్చారు. 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని నోటీసులో తెలిపారు. ఆర్-కార్డు ఉన్న వారందరికీ శాశ్వత ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు.