అప్పుడు అదే ప్లస్.. ఇప్పుడు అదే మైనస్ : ఎమ్మెల్యే రోజాపై వ్యతిరేకత పెరుగుతోందా..?

  • Published By: veegamteam ,Published On : January 7, 2020 / 06:00 AM IST
అప్పుడు అదే ప్లస్.. ఇప్పుడు అదే మైనస్ : ఎమ్మెల్యే రోజాపై వ్యతిరేకత పెరుగుతోందా..?

ఒకప్పుడు వెండితెరపై వెలిగిన ఈమె.. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ.. టీవీ ప్రొగ్రామ్స్‌లో రెగ్యులర్‌గా కనిపిస్తూ.. పాలిటిక్స్‌కు ఫుల్‌ టైమ్‌ కేటాయిస్తున్నారు. వైసీపీలో ఫైర్‌ బ్రాండ్‌గా ఎదిగిన ఆమెకు అదే ప్లస్‌. కానీ… ఇప్పుడదే పార్టీకి మైనస్‌ అవుతోంది. బ్రాండ్‌లో ఉన్న ఫైర్‌ ఎప్పటికైనా ప్రమాదమే కదా.. 

అసలే పార్టీలో కొంత అసంతృప్తిగా ఉన్న ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా.. ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రోజాపై దాడియత్నం వ్యవహారం పెద్ద రచ్చ అయ్యేలా కనిపిస్తోంది. దీనిపై సొంత పార్టీ కార్యకర్తలపైనే రోజా కేసులు పెట్టే వరకు వెళ్లారు. పుత్తూరు పోలీసు స్టేషన్‌లో పలువురు వైసీపీ కార్యకర్తలపైనా కేసు నమోదైంది. కేబీఆర్ పురంలో తన కారుపై దాడి చేశారని రోజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్‌ సంపత్, సురేష్ రిషేంద్ర, అంబు సరళ, రామ్మూర్తిలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు బుక్ చేశారు. 

రోజాపై కోపమెందుకు..?
ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో చిచ్చు రేపుతోందంటున్నారు. సొంత పార్టీ కార్యకర్తలే తనపై దాడి చేయడాన్ని రోజా సీరియస్‌గా తీసుకున్నారట. మరోపక్క, రోజా తీరుపై కూడా పార్టీ నియోజకవర్గ కార్యకర్తల్లో ఒక వర్గంగా గుర్రుగా ఉందంటున్నారు. పార్టీ కోసం ఎప్పటి నుంచో పాటు పడుతున్న తమను రోజా గుర్తించడం లేదని వారు అంటున్నారు. తమను కాదని టీడీపీ నుంచి పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ కార్యకర్తలు అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారట. ఈ విషయంలో భాగంగానే రోజాపై ఆ వర్గం దాడికి ప్రయత్నించిందని అంటున్నారు. 

రోజాపై దాడికి యత్నం:
వివిధ కార్యక్రమాల శంకుస్థాపన కోసం వచ్చిన ఎమ్మెల్యే రోజాను కేబీఆర్ పురం గ్రామంలోకి ప్రవేశించకుండా ఒక వర్గం వైసీపీ నేతలు అడ్డుకున్నారు. సుమారు 20 నిమిషాల పాటు ఆమె కారును ముందుకు కదలనివ్వలేదు. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. గ్రామ సచివాలయ కార్యక్రమానికి తమను పిలవకపోవడాన్ని తప్పు పట్టారు. కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. రోజా కారులో నుంచే వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వైసీపీ కార్యకర్తలు ఆమె మాట వినకుండా మరింత పెద్దగా ఎమ్మెల్యే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

టీడీపీ వాళ్లకు ప్రాధాన్యం:
తాను కారులో ఉండగా అమ్ములు వర్గీయులు కారుపై దాడికి ప్రయత్నించారని రోజా ఆరోపించారు. గత ఎన్నికల్లో అమ్ములు వర్గం తనకు వ్యతిరేకంగా పని చేసిందని రోజా చెబుతున్నారు. కానీ, అమ్ములు వర్గం మరోలా చెబుతోంది. ఎమ్మెల్యే రోజా పార్టీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని అంటోంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి తమను పట్టించుకోవడం లేదని, కనీసం పార్టీ కార్యకర్తలుగా కూడా గుర్తించడం లేదని అమ్ములు వర్గం విమర్శిస్తోంది. ఈ వ్యవహారంలో సొంత పార్టీ కార్యకర్తలపైనే ఎమ్మెల్యే రోజా కేసు పెట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.

మంత్రి పదవి దక్కనందుకు అసంతృప్తి:
నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. వాస్తవానికి తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ, అలా జరగలేదు. ఆ తర్వాత ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ పదవి అప్పగించినప్పటికీ ఆమెలో కొంత అసంతృప్తి ఉందనే టాక్‌ నడిచింది. మొన్నటి అసెంబ్లీ సమావేశాల ముందు వరకూ కూడా రోజా ఎక్కడా ఎక్కువగా మాట్లాడలేదు. అసెంబ్లీలో మాత్రం కాస్త గట్టిగా చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో పార్టీలోని ఒక వర్గాన్ని దూరం చేసుకోవడంతో నియోజకవర్గంలో అసంతృప్తి మొదలైందంటున్నారు. పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యేకు తమ అసంతృప్తి తెలియజేసేందుకే పార్టీ కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆమె పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టారు. మరి అధిష్టానం కలుగజేసుకొని కేసులను ఉపసంహరించేలా చేస్తుందా? లేదా అని జనాలు ప్రశ్నిస్తున్నారు.