ఆసియా అపర కుబేరుడిగా మళ్లీ అంబానీ. ఫేస్‌బుక్‌ ఒప్పందంతో జాక్ మాను దాటేసిన ముకేష్

  • Published By: chvmurthy ,Published On : April 23, 2020 / 08:24 AM IST
ఆసియా అపర కుబేరుడిగా మళ్లీ అంబానీ. ఫేస్‌బుక్‌ ఒప్పందంతో జాక్ మాను దాటేసిన ముకేష్

అంబానీ సంప‌ద ఎంత పెరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. అత్యంత సంపన్నుడైన రిలయెన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ తన సంపదను భారీగా పెంచుకుంటున్నారు. కరోనా రాకాసి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. వాణిజ్య, వ్యాపార సముదాయాలు, ఇతర సంస్థలన్నీ తాళాలు పడ్డాయి. దీంతో ఆర్థికరంగం కుదేలవుతోంది. కానీ అంబానీ ఆదాయం ఏ మాత్రం తగ్గడం లేదు. 

అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా చైనా ఈ కామర్స్ సంస్థ ఆలీబాబా అధినేత జాక్ మానును అంబానీ మరోసారి అధిగమించారు. Facebook – Reliance jio మధ్య భారీ డీల్ జరిగిన సంగతి తెలిసిందే. దీంతో 2020, ఏప్రిల్ 22వ తేదీ బుధవారం రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ ఏకంగా 10 శాతం పెరిగింది. 

ఈ క్రమంలో ముఖేష్ సంపద 49.2 బిలియన్ డాలర్లకు చేరింది. జాక్ మా సంపద కంటే 3.2 బిలియన్ డాలర్ల ఎక్కువ 
సంపదతో మరోసారి ఆసియాలో అత్యంత శ్రీమతుండిగా అంబానీ అవతరించారు. ఫేస్ బుక్ తో డీల్ చేసుకోవడాన్ని ప్రముఖ  పారిశ్రామికవేత్తలు స్వాగతిస్తున్నారు. అంబానీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

జియోలో ఫేస్ బుక్ రూ. 43, 574 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయనడానికి ఈ ఒప్పందం నిదర్శనమని కొందరు అంటున్నారు. ప్రపంచ పెట్టుబడులకు భారత్ కేంద్రస్థానం అవుతుందని ఆనంద్ మహీంద్ర అన్నారు. బ్రావో ముకేష్ అని కొనియాడారు.