జొమోటో చేతికి ఉబర్!

  • Published By: vamsi ,Published On : December 16, 2019 / 06:58 AM IST
జొమోటో చేతికి ఉబర్!

స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్… ఇలా ఫుడ్ డెలివరీ యాప్స్‌ బోలెడు ఉన్నాయి. ఇలా ఆర్డర్ ఇవ్వగానే… అలా ఫుడ్ తెచ్చి ఇస్తూ చక్కటి బిజినెస్ చేసుకుంటున్నాయి. ఐతే ఆఫర్లు ఇచ్చినంతకాలం ఆర్డర్లు బాగానే వచ్చినా కూడా ఇప్పుడు ఆఫర్లు తీసేయడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఫలితంగా ఫుడ్ డెలివరీ మార్కెట్… ప్రతీ నెలా 1 నుంచీ 2 శాతం పడిపోతోంది. ఆర్డర్ల సంఖ్య 30 లక్షలకు మించట్లేదు. ఎంత ట్రై చేసినా ఆర్డర్ల సంఖ్య తగ్గిపోతోంది.

మిగతా యాప్స్ సంగతి ఎలా ఉన్నా జొమాటో, ఉబర్ ఈట్స్ నష్టాలు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఉబర్‌ టెక్నాలజీస్‌కు చెందిన ఉబర్‌ ఈట్స్‌ భారత విభాగాన్ని స్థానిక ప్రత్యర్థి జోమాటోకు అమ్మేందుకు సిద్ధమైంది. ఈ  మేరకు చర్చలు జరుపుతున్నాయి ఇరు సంస్థలు. షేర్ల మార్పిడి ద్వారా జరిగే ఈ ఒప్పందం వచ్చే నెలలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా జొమోటో సంస్థ ఉబర్ ఈట్స్‌ని కొనుగోలు చెయ్యాలని నిర్ణయించుకుంది.

ప్రస్తుతం ఉబెర్ ఈట్స్ ఇండియా వ్యాపారం భారత్‌లో 400 మిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా, ఉబెర్ జోమాటోలో 150 నుండి 200 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు అని తెలుస్తుంది. ఈ ఒప్పందం పూర్తయితే జొమోటో ఆర్డర్లు రోజుకు 60లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అంటుంది కంపెనీ.